సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ ల మధ్య వివాదం రోజురోజుకీ పెద్దదైపోతుంది. విశ్వక్ సేన్ పై ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు అర్జున్. 3 నెలల క్రితం విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా.. తనే దర్శకుడుగా, నిర్మాతగా అర్జున్ ఒక సినిమాని ప్రారంభించారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే సడన్ గా అర్జున్.. ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ ప్రవర్తన బాలేదంటూ విమర్శలు చేశారు. విశ్వక్ సేన్ వల్ల తనకి, తన యూనిట్ కి అవమానం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలో విశ్వక్ సేన్ తనను ఇబ్బంది పెట్టాడని, మెసేజ్, ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వడంటూ ఆరోపణలు చేశారు. దీనిపై విశ్వక్ సేన్ స్పందించారు.
ఆదివారం జరిగిన రాజయోగం సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వెళ్లిన విశ్వక్ సేన్ ఈ వివాదంపై స్పందించారు. షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ అయినా చెప్తే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అంటూ వ్యాఖ్యానించారు. ఒక్కరితో అయినా తన ప్రవర్తన బాలేదని చెప్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణుకి అర్జున్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ ప్రవర్తన సరిగా లేదని, షూటింగ్ సమయంలో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, తనను, తన యూనిట్ ని అవమానించాడంటూ మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారన్న టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ఒకవేళ నిజం అయితే దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.