రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని సినిమా చూడచ్చు. పైరసీ కదండీ బాబు. దర్జాగా ఓటీటీలోనే చూడచ్చు. థియేటర్ కి వెళ్లే పని లేదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడచ్చు. పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా ఏ సినిమా అయినా సరే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూడచ్చు. అదెలాగో మీరే చూడండి.
ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే ఖర్చు తడిసిమోపుడవుతుంది. దానికి తోడు పాప్ కార్న్ లు, కూల్ డ్రింక్ లు సరదా తీర్చే ఖర్చులతో మిడిల్ క్లాస్ వాళ్లకి ఆస్తి కోల్పోయిన భావన కలుగుతుంది. అదే సినిమా ఓటీటీలో వస్తే తక్కువ ధరకే చూడచ్చు కదా అని చాలా మంది విడుదల రోజున కాకుండా ఓటీటీలోకి వచ్చాక చూద్దామని ఆగిపోతారు. మామూలుగా సినిమా థియేటర్ లో రిలీజైన రెండు నెలల తర్వాత గానీ ఓటీటీలోకి రాదు. కానీ ఇక నుంచి రిలీజ్ రోజునే సినిమాను ఓటీటీలో కూడా చూడవచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఓటీటీలో తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం సినిమా చూడచ్చు. కాకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటివి కాదు. ప్రభుత్వ ఓటీటీ ప్లాట్ ఫామ్. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త సినిమా విడుదలైన రోజే చూసే అవకాశం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్), ఏపీ ఫైబర్ సంయుక్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా విడుదల చేసే అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. నిర్మాతలను, ప్రేక్షకుల మధ్యలో ప్రభుత్వం తప్ప ఎవరూ లేకుండా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. నిర్మాత, ప్రభుత్వం ఆలోచించుకుని ఒక ధర ఫిక్స్ చేస్తారు. ఫైబర్ నెట్ ప్లాట్ ఫామ్ లో కొత్త సినిమా ఏది విడుదలైనా అదే రోజున చూసేయచ్చు. దీని కోసం ఏపీ ప్రభుత్వం నిర్మాతలతో కలిసి పని చేస్తోంది. కొత్త సినిమా విడుదలైన రోజునే ఏపీ ఫైబర్ నెట్ వేదికలో విడుదల చేయాలనుకునే నిర్మాతలకు ఆహ్వానం పలుకుతోంది. వీడియో ఆన్ డిమాండ్ (పే పర్ వ్యూ) కాన్సెప్ట్ ను తీసుకొస్తుంది. ఆసక్తి ఉన్న నిర్మాతలతో మీటింగ్ ఏర్పాటు చేసింది. నిర్మాతలు థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా విడుదల చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చునన్న మాట.
ఆ మధ్య డిష్ టీవీ మూవీ ఆన్ డిమాండ్ పేరుతో కొత్త సినిమాలను విడుదల రోజునే తీసుకొచ్చేది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వీడియో ఆన్ డిమాండ్ పేరుతో కొత్త సినిమాలను చూసే అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తోంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏప్రిల్ 7న శుక్రవారం నాడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలు నిర్మాతలను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి సమాచార సాంకేతిక శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్, ఫైబర్ నెట్ ఛైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు అలీ, క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ జోగినాయుడు, సినీ నిర్మాత సి. కళ్యాణ్, పలువురు నటీనటులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.
పే పర్ వ్యూ.. ఒక వ్యూకి ఇంత అని వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎలా కాదన్న ఈ ఏపీ ఫైబర్ యాప్ ద్వారా రిలీజ్ రోజునే సినిమాలు చూసే అవకాశం కల్పించడం ద్వారా అటు నిర్మాతలకూ, ఇటు ప్రజలకూ లాభమే. ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది. ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూడలేని పేదలకు, మధ్యతరగతి వారికి దీని వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది. థియేటర్ లో నలుగురు చూసే టికెట్ ధర కంటే ఓటీటీలో తక్కువ ధరే ఉండచ్చు. కాబట్టి పేదవారికి, మధ్యతరగతి వారికి చాలా వరకూ డబ్బు ఆదా అవుతుందని చెప్పవచ్చు. మరి కొత్త సినిమా విడుదలైన రోజునే చూసే అవకాశం కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
AP Government to Collaborate with Interested Producers to show Their Films simultaneously on the AP Fibre net Video-on-Demand (Pay-per-View) Platform. Noted films opting for this is highly Unlikely though! pic.twitter.com/lwavj15ntG
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 6, 2023