తెలుగు కామెడీ షోల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది నటీ నటులు వెండి తెరపైకి వచ్చారు. అంతకు ముందు ఉన్నవారు సైతం ఈ షోలో పాల్లొని .. మళ్లీ పెద్ద స్క్రీన్ లో సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. వేణు బలగం వంటి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు దర్శకుడిగా మారుతున్నారు.
తెలుగు బుల్లితెరపై పాపులర్ కామెడీ షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు, టెక్నీషియన్లు వెలుగులోకి వచ్చారు. వెండి తెరపై అడపా దడపా సినిమాల్లో కనిపించినా రానీ ఫేమ్ ఈ షో తెచ్చిపెట్టింది. ఈ షో ద్వారా చాలా మంది మళ్లీ వెండితెరపై మెరుస్తున్నారు. చంటి, చంద్ర, రాకెట్ రాఘవ, అవినాష్, రోలర్ రఘు వంటి వారు కమెడియన్లుగా రాణిస్తుంటే.. ఆది, మహేష్, శ్రీను వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ హీరో అయ్యారు. అలాగే కమెడియన్ వేణు.. ఇప్పుడు డైరెక్టర్‌గా మారి బలగం వంటి సూపర్, డూపర్ హిట్ సినిమాను తీసుకువచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. అయితే అతడు డైరెక్టర్ గా మారి సక్సెస్ సాధించడంతో మరి కొంత మందికి స్ఫూర్తినిచ్చినట్లయింది.
తొలుత కంటెస్టెంట్‌గా వచ్చి పలు టీముల్లో నటించాడు శాంతి కుమార్ తుర్లపాటి . ప్రస్తుతం టీమ్ లీడర్ అయ్యారు. షైనింగ్ శాంతికుమార్ పేరుతో స్కిట్స్ చేస్తున్నారు. వేణు స్ఫూర్తితో తాజాగా ఆయన దర్శకత్వం వైపు మళ్లారు. అతని దర్శకత్వంలో నాతో నేను అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదిత్య ఓం, సాయికుమార్, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్ పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులు. ఇందులో సమీర్, సి.వి.ఎల్. నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. ఈ చిత్రానికి సత్య కశ్యప్ స్వర రచన చేస్తుండగా, నేపథ్య సంగీతం ఎస్. చిన్న అందిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘టైటిల్ బావుంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’ అని ఆశీస్సులు అందించారు. సాయికుమార్ మాట్లాడుతూ ..మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారని, ఇందులో తాను భాగం కావడం ఆనందంగా ఉందని, మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ.. ఓ చక్కని కథ రాసుకుని, మొదట నిర్మాతల్ని వెతుక్కున్నానని, కథ నచ్చి వెంటనే వారు అంగీకరించారన్నారు. తన తొలి ప్రయత్నానికి సాయికుమార్ అండగా నిలిచారని, చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారన్నారు.