తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆండ్రియా జెర్మయ్యా. ఆండ్రియా సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి హీరోయిన్‌గా మారారు. నటనలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె తాజా చిత్రం ‘అనల్ మేలే పలితులి’ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదల సందర్భంగా ఆండ్రియా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న తనంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పారు.
ఆండ్రియా మాట్లాడుతూ.. ‘‘ నేను ఇప్పటి వరకు ఓ రెండు సార్లు మాత్రమే బస్సులో ప్రయాణం చేశాను. నా చిన్నతనంలో మా ఫ్యామిలీ మొత్తం బస్సులో వేలాంగిని మాత గుడికి వెళ్లాం. బస్సులో నేను మా నాన్న పక్కన కూర్చున్నాను. నా వెనకాల ఓ వ్యక్తి ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరిదో చెయ్యి నా టీషర్టులోకి దూరింది. నా వీపు వెనకాలినుంచి అతడు టీషర్టులోకి చెయ్యి పెట్టాడు. నేను మొదట అది మా నాన్న చెయ్యి అనుకున్నాను. కొద్దిసేపటి తర్వాత అ చెయ్యి మరింత లోపలికి వెళ్లసాగింది. నేను మా నాన్న వైపు చూశాను. ఆయన రెండు చేతులు బయటే ఉన్నాయి. అప్పుడు నాకు విషయం అర్థం అయింది. వెంటనే అక్కడినుంచి పక్కకు వచ్చాను. ఆ విషయం మా నాన్నకు కూడా చెప్పలేకపోయాను.
కానీ, నేను ఎందుకు ఆ విషయం మా నాన్నకు చెప్పలేకపోయానో నాకు ఇప్పటికీ అర్థం కావటంలేదు. బహుశా మనం పెరిగిన సమాజం అలాంటిది కావచ్చు. నా జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాను. నేను బస్సులోనే స్కూలుకు వెళ్లాలని ఏమీ లేదు. కానీ, నా స్నేహితురాళ్లు బస్సులోనే రావాలి. వాళ్లు అప్పుడప్పుడు బస్సులో తమకు ఎదురైన అనుభవాలను చెబుతూ ఉండేవారు. ఏడుస్తుండేవారు. తర్వాతి రోజు మళ్లీ బస్సులోనే వచ్చేవారు. ఓ సారి ఒకడు బస్సులోనే నాకు గట్టిగా ఐలవ్‌యూ చెప్పాడు’’ అంటూ తన అనుభవాలను పంచుకుంది.