ప్రస్తుతం ఉన్న బుల్లితెర స్టార్ యాంకర్లలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. డాన్సర్ గా, యాంకర్ గా తనని తాను నిరూపించుకున్న ప్రదీప్.. ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇప్పటికే “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా తీశాడు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలతో ప్రదీప్ బయటపడ్డాడు. ప్రస్తుతం రెండో సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే బుల్లితెరలో ఉన్న మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. ప్రతి షో, ఇంటర్వ్యూలో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది.
2018లో ఓసారి స్వయంవరం థీమ్ తో ప్రదీప్ ఓ షో చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రదీప్ పెళ్లి అయిపోతుంది అంటూ చాలానే పుకార్లు వచ్చాయి. వాటిని తర్వాత ప్రదీప్ ఖండించాడు. అసలు ఆ షో అయిపోయేసరికి ప్రదీప్ పెళ్లి అయిపోతుందని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ షో విషయంలో ప్రదీప్ కూడా తనపై తానే కౌంటర్లు వేసుకున్నాడు. అసలు ఎందుకు చేశానో ఆ షో అనైే అర్థం వచ్చేలా పరోక్షంగా కామెంట్లు కూడా చేశాడు. అప్పట్లో ఆ షో నిజంగానే ప్రదీప్ కు బాగా నెగిటివ్ అయ్యింది.
ఇప్పుడు మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తల్లో నిలిచింది. ఫలానా అమ్మాయిన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి మరెవరో కాదు.. సెలబ్రిటీ స్టైలిష్ట్ నవ్యా మారౌతు. ఆ వార్తల్లోనూ నిజం లేదని మరోసారి ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు. “నేను కాస్త బిజీగా ఉండటం వల్ల ఈ వార్తలపై ఆలస్యంగా స్పందిస్తున్నాను. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. ప్రొఫెషన్ పరంగా మా టీమ్ వాళ్లు ఆమెతో మాట్లాడి ఉండచ్చు. కొన్ని పోస్టుల్లో ట్యాగ్ కూడా చేసుండచ్చు. ఇలాంటి వార్తల్లో ఆమె పేరు రావడం నాకు చాలా బాధగా ఉంది” అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
“నాకు ఇప్పుడల్లా పెళ్లి చేసుకోవాలని లేదు. నాన్న చనిపోయిన బాధ నుంచి మా కుటుంబం ఇప్పుడు బయట పడుతోంది. నా పెళ్లికి ఇంకాస్త సమయం ఉంది. నేను ప్రస్తుతం నా రెండో సినిమాపై ఫోకస్ చేస్తున్నాను. 2023లో నేను హీరోగా రెండో సినిమా రాబోతోంది. దాని కోసమే నేను రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాను” అంటూ ప్రదీప్ మాచిరాజు క్లారిటీ ఇచ్చాడు. ఇంక యాంకర్ గా ప్రదీప్ ఢీ15, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, ఓటీటీలో సర్కార్ అనే షో చేస్తున్నాడు. హీరోగా తన అదృష్టాన్ని 2023లో మరోసారి పరీక్షించుకోనున్నాడు.