అమలా పాల్.. ఎన్నో విభిన్న పాత్రలతో తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా.. తమిళ్ లో మాత్రం చిత్రాలు చేస్తోంది. తాజాగా హీరోయిన్ నుంచి అమలాపాల్ నిర్మాత అవతారం ఎత్తింతి. ‘కడవెర్’ అనే ఒక ఇన్‌వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో లీడ్ రోల్‌లో నటించడమే కాకుండా.. ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది.
ఈ సినిమా ఆగస్టు 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. పోలీస్ సర్జన్ డాక్టర్ భద్ర పాత్రలో అమలా పాల్ నటించింది. అందుకోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు. ఎంతో మంది నిపుణులను కలిసి అసలు క్రైమ్ జరిగాక ఎలా ఇన్‌వెస్టిగేషన్ ఉంటుంది. క్రైమ్ సాల్వ్ చేయడంలో హాస్పిటల్, డాక్టర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే వాటిపై పూర్తిగా రీసెర్చ్ చేసినట్లు తెలియజేశారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో అమలాపాల్ ఎన్నో అనుభవాలను పంచుకుంది. “కడవెర్ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఎంతో మంది నిపుణులను కలిశాం. డైరెక్టర్ అనూప్ పనికర్, రైటర్ అభిలాష్ పిళ్లైతో కలిసి ఎంతో సమాచారం సేకరించాం. ఆ క్రమంలోనే నేను మార్చురీలో పోస్టుమార్టం చేయడం చూశాను. అది నా జీవితంలో మర్చిపోలేని, నా హృదయాన్ని కదిలించిన దృశ్యం” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
“పోస్టుమార్టం చేసిన దృశ్యం నా జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత నుంచి ప్రతి విషయాన్ని నేను చూసే దృష్టికోణం మారింది. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా నాపై అదనపు బాధ్యత ఉంచిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం నా జుట్టును కూడా కత్తిరించుకుని ఒదిగిపోవాలనుకున్నాను. స్క్రిప్ట్ విన్న సమయంలో భద్ర పాత్రను అస్సలు ఊహించుకోలేకపోయాను. వైద్యులు ఎలా ఉంటారో తెలుసుకునేందుకు చాలా శ్రమించాను” అంటూ అమలాపాల్ తన అనుభవాలను పంచుకుంది. అమలాపాల్ కడవెర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.