అల్లు అర్జున్ బర్త్‌డే నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. పుష్ప-2 నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనితో పాటు బన్నీ తన ట్విట్టర్‌లో పుష్ప2 ది రూల్ బిగిన్స్ అంటూ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గంగమ్మ తల్లి గెటప్‌లో పుష్పరాజ్ విశ్వరూపం చూపాడు. మరి ఆ తల్లి చరిత్ర ఏంటి వంటి వివరాలు..
బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా పుష్ప పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నేడు అల్లు అర్జున్ బర్త్‌డే. రగ్‌డ్ లుక్‌తో.. కాస్త హ్యాండికాప్ పర్సన్ గెటప్‌లో కనిపించినా సరే.. అభిమానులు బన్నీని ఆదరించారు.. ఆకాశానికి ఎత్తారు. ఇక పుష్ప-2 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక బన్నీ బర్త్‌డే (ఏప్రిల్ 8) సందర్భంగా.. పుష్ప-2కి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. పులిని చూసి జంతువులు భయపడతాయి.. అదే పులే రెండడుగులు వెనక్కి వేసింది అంటే.. పుష్ప వచ్చుండాడని అర్థం అంటూ రిలీజ్ చేసిన టీజర్.. ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. పుష్ప-2 ఏం రేంజ్‌లో ఉంటుందో టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు సుకుమార్.
ఇక దీనితో పాటు అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు ఎంత భయంకరంగా ఉంటుందో.. అదే విధంగా బన్నీ కూడా ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తోన్న ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చీర కట్టులో.. మెడలో నిమ్మకాయల దండతో.. ఒంటి నిండా ఆభరణాలతో.. కాలీ మాతకు ప్రతీకలా దర్శనమిచ్చాడు బన్నీ. ఆ నిల్చున్న తీరు, కళ్లల్లో రౌద్రం చూస్తే.. శత్రువుల ఊచకోత ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ఫొటోలో బన్నీని చూసి గంగమ్మ తల్లి అవతారంలో ఉన్నాడు అంటున్నారు కొందరు నెటిజనులు. మరి బన్నీ గంగమ్మ తల్లి అవతారంలో కనిపించడం ఏంటి.. అసలు ఆ అమ్మవారి చరిత్ర ఏంటి అనే దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
తిరుపతిప్రాంత వాసులకు గంగమ్మ తల్లి గురించి.. గంగమ్మ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర ఎలానో.. ఇక్కడ గంగమ్మ తల్లి జాతర అంత ప్రసిద్ధి గాంచింది. జాతర జరిగే సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించే క్రమంలో కొందరు ఇలా వైవిధ్యమైన వేషధారణలో కనిపిస్తారు. దానిలో భాగంగాగానే కొందరు మగాళ్లు.. అమ్మవారిలా స్త్రీ వేషం ధరిస్తారు. ఇక అల్లు అర్జున్ గెటప్ విషయానికి వస్తే.. పుష్ప సినిమా అంతా తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంటుంది. దానిలో భాగంగానే పుష్ప ఇలా గంగమ్మ గెటప్‌లో వచ్చి.. తన శత్రువలను సంహరిస్తాడని.. సినిమాలో ఈ సీన్ హైలెట్‌గా ఉండనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక ఈ మధ్య కాలంలో ప్రాంతీయతకు పెద్ద పీట వేసిన సినిమాలు భారీ విజయం సాధిస్తోన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే సుకుమార్ తిరుపతి గంగమ్మ జాతరను హైలెట్ చేశాడని అంటున్నారు. ఇక తిరుపతి ప్రాంతంలో జరిగే గంగమ్మ జాతర ఎంతో ఫేమస్. మన దగ్గర ప్రతి గ్రామానికి గ్రామ దేవత ఉంటుంది. అలానే తిరుపతి కూడా గంగమ్మ తల్లి గ్రామ దేవత. ఆ తల్లి మీద భక్తితో ఎనిమిది రోజుల పాటు ఎంతో ఘనంగా జాతర నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలి వస్తారు. మరి ఈ జాతర ఎలా ప్రారంభం అయ్యింది.. చరిత్ర ఏం చేబుతుంది అంటే..
తిరుపతి ప్రాంతంలో పూర్వం పాలేగాళ్లు పాలించేవాళ్లు. అలా ఒక పాలేగాడు.. తన రాజ్యంలోని అందమైన యువతులపై అత్యాచారం చేసేవాడు. కొత్తగా పెళ్లైన నవ వధువులు.. మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించేవాడు. వారి బారి నుంచి తమను కాపాడాలంటూ.. మహిళలంతా అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల మొరలు విన్న ఆ తల్లి తిరుపతికి 2 కిమీ దూరంలోని అవిలాల గ్రామంలోని ఓ కైకాల కుటుంబలో గంగమ్మగా జన్మించిందని చెబుతారు. యుక్తవయసుకు వచ్చే సరికి గంగమ్మ అపురూప సౌందర్య రాశిగా మారింది. దాంతో పాలెగాడి కన్ను ఆమె మీద పడింది. గంగమ్మపై అత్యాచారం చేయబోయాడు. ఆగ్రహించిన తల్లి.. తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
ఇక తనను అంతమొందించడానికి స్వయంగా అమ్మవారే గంగమ్మ రూపంలో అవతరించిందిన తెలుసుకున్న పాలెగాడు.. పారిపోయి దాక్కున్నాడు. అతడిని వెతకడం కోసం గంగమ్మ అనేక రూపాలు ధరించి.. సుమారు మూడు రోజుల పాటు గాలించింది. అయిన పాలెగాడి జాడ దొరకలేదు. దాంతో నాలగవ రోజున గంగమ్మ.. దొర వేషం వేసింది. అది చూసిన పాలెగాడు.. తన ప్రభువైన దొర వచ్చాడనుకుని బయటకు వచ్చాడు. రాగానే ఆ తల్లి.. పాలెగాడి తల నరికి సంహరించింది. ఈ సంఘటన తర్వాత ఆ తల్లి దయ మీద ఇలానే ఉండాలనే ఉద్దేశంతో.. ప్రజలు ప్రతి ఏటా గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తారు.
తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఆ తర్వాత.. ఎనిమిది రోజుల పాటు జాతర సాగుతుంది. ఇక జాతర చివరి రోజున అత్యంత ప్రధానమైన విశ్వరూప దర్శన ఘట్టం జరుగుతుంది. దీని కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఏడో రోజు అయిన సప్పరాల ఉత్సవం రోజున.. గంగమ్మ తల్లి జన్మించిన కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. దీనిలో భాగం నీలం రంగు ద్రవంతో బంకమన్ను కలిపి.. అమ్మవారి భీకరమైన విశ్వ రూపాన్ని తయారు చేస్తారు. ఎనిమిదో రోజున విశ్వరూప ఘట్టంలో దర్శనం ఇచ్చేది ఈ అమ్మవారి ప్రతిమే.
ఇక తాజాగా పుష్ప ధరించిన గెటప్ కూడా అమ్మవారి విశ్వ రూప ఘట్టానికి చెందినదే. నాడు ఆ తల్లి.. కామాంధుడిని శిక్షిస్తే.. పుష్పరాజ్ అదే వేషంలో.. తన విశ్వ రూపం చూపి.. శత్రువులను అంతం చేస్తాడు. గంగమ్మ తల్లి ఎంత శక్తివంతమైనదో.. పుష్ప కూడా అంతే శక్తివంతమైన వ్యక్తిగా చూపడం కోసం.. ఈ సినిమాలో బన్నీ ఈ గెటప్‌లో కనిపించాడు అంటున్నారు అభిమానులు. మరి సినిమాలో ఈ గెటప్‌కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియాలంటే.. పుష్ప-2 విడుదల వరకు ఆగాల్సిందే. మరి ఈ గెటప్‌పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023