సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
తల్లిదండ్రులు సెలబ్రిటీలు అయితే.. వారి పిల్లలు కూడా పుట్టుకతోనే సెలబ్రిటీలు అవుతారు. దాంతో వారు కూడా మీడియా, పాపారాజీలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అందంగా గడపాల్సిన బాల్యం కాస్త స్వేచ్ఛ లేకుండా.. ఎక్కడి వెళ్లినా చుట్టుముట్టే జనాల గురించి ఆలోచించి.. నాలుగ్గోడల మధ్యనే గడుపుతారు. వారు ఎంజాయ్ చేయాలంటే.. విదేశాలకు వెళ్లినప్పుడే సాధ్యం. ఇక సెలబ్రిటీల పిల్లల మీద మీడియా, సోషల్ మీడియా నిఘా కాస్త ఎక్కువగా ఉంటుంది. వారేం చేసినా.. అది సంచలనమే అవుతుంది. ఇక వారికి సంబంధించి కూడా మీడియాలో బొలేడు వార్తలు వస్తాయి. వీటిలో కొన్ని నిజాలు ఉంటే.. అధిక శాతం పుకార్లే ఉంటాయి. సెలబ్రిటీల పిల్లలు అయినందుకు వారి గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. కొందరు పట్టించుకోరు.. కొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. ఇక తాజాగా ఐశ్వర్యరాయ్ కుమార్తె.. తప్పుడు వార్తలపై హైకోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలు..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు.. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతుల గారాల పట్టి.. ఆరాధ్యా బచ్చన్ తాజాగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కుతోంది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది. నేడు అనగా గురువారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. కొన్ని యూట్యూబ్ చానెల్స్ తన గురించి, తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ.. 11 ఏళ్ల ఆరాధ్య.. కోర్టును ఆశ్రయించింది. తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సదరు చానెల్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో అభ్యర్థించింది.
వాస్తవంగా చెప్పాలంటే.. ఆరాధ్య బచ్చన్‌పై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో తన మీద జరిగే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరాధ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుంటారు కొందరు. ఒకానొక దశలో ఈ ట్రోలింగ్స్, వార్తలపై విసుగుపోయిన అభిషేక్ బచ్చన్.. తనను, తన కూతురిని టార్గెట్ చేయడం మానుకోవాలని బాలీవుడ్ మీడియాను కోరారు. అంతేకాక సందు దొరికితే చాలు.. ఐశ్వర్య-అభిషేక్ విడిపోతున్నారు.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తాయి.
తన కూతురిపై వస్తోన్న ట్రోల్స్‌ని ఉద్దేశించి గతంలో అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబ్ బిస్వాస్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో అభిషేక్ మాట్లాడుతూ.. ‘ఈ ట్రోల్స్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకారయోగ్యం కాదు. ఇలాంటి పనులకు పాల్పడేవారిని క్షమించాల్సిన అవసరం కూడా లేదు. నేనొక సినీ నటుడిని అయినంత మాత్రాన ఈ రంగంతో అస్సలు సంబంధం లేని నా కూతురిని టార్గెట్ చేస్తారా. నన్ను ఏమైనా అనాలనుకుంటే నా దగ్గరకు వచ్చి.. నా మొహం మీద అనండి. నా బిడ్డ మీద ఎందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారు.. తనను ఎందుకు దీనిలోకి లాగుతున్నారు’ అంటూ అప్పట్లో అభిషేక్ బచ్చన్ కాస్త ఘాటుగానే స్పందించారు. సెలబ్రిటీల గురించి ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.