సినిమా హీరోయిన్స్ అన్నాక పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది కామన్. కొందరు భర్తను ఒప్పించి సినిమాలలో కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు భర్త మాటకు విలువిచ్చి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే.. పెళ్లయ్యాక సినిమాలు చేయడం, చేయకపోవడం హీరోయిన్ ఇష్టం. కానీ, ఆ హీరోయిన్ నిజంగానే సినిమాలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అది అభిమానులకు చేదువార్తే అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట.
నయనతార తన ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. జూన్ 9న నయన్ – విఘ్నేష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ఇద్దరు కలిసి బంధువులు, సన్నిహితులు, తెలిసిన వారందరికీ పెళ్లి కార్డులను పంచడం మొదలుపెట్టేశారు. తాజాగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ ఫ్యామిలీకి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత నయనతార సినీ కెరీర్ పై సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది.
సౌత్ లో గ్లామరస్ హీరోయిన్ నుండి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయన్.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, డిప్రెషన్ వరకూ వెళ్లి తిరిగి ఫామ్ లోకి వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. స్టార్ హీరోలకు ధీటుగా స్టార్డమ్ తెచ్చుకొని, రెమ్యూనరేషన్ కూడా వారి స్థాయిలోనే అందుకోవడం విశేషం. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాల్లో బలమైన పాత్రలు చేస్తూ రాణిస్తుంది. ఇప్పుడు తెలుగులో `గాడ్ ఫాదర్`, హిందీలో షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో కనిపించనుంది. మరోవైపు ఆమె నటించిన `ఓ2`, `గోల్డ్` చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే నయనతార.. త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందంటూ ఓ వార్త ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది.
పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య తనకు ఫ్యామిలీ లైఫ్ ముఖ్యమని చెప్పింది విదితమే. తాను కూడా వైవాహిక జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయాలని, వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అందుకే నయన్ కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదని.. ప్రస్తుతం కమిట్ అయినవరకే చేసి ఫుల్ స్టాప్ పెట్టనుందని తమిళ వర్గాల టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మరి నయన్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.