కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి.. ఈ మాట అందరికీ తెలుసు. కానీ చాలా కొందరే తాము కన్న కలలను నిజం చేసుకునేందుకు కష్టపడుతుంటారు. అలాంటి కొద్ది మందిలో చాలామంది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. అలాంటి వారిలో అడివి శేష్ కూడా ఒకడు. ఇతను ఒక్క యాక్టర్ మాత్రమే కాదు.. డైరెక్టర్, స్క్రీన్ రైటర్ కూడా. తన సినిమా తానే రాసుకుని తానే డైరెక్ట్ చేసుకుని హిట్టు కొట్టి చూపించాడు. అయితే ఒక్కసారి మాత్రమే కాదు.. రెండు మూడు సార్లు అదే రిపీట్ అయ్యింది. అప్పుడెప్పుడో 2010లో వచ్చిన కర్మ సినిమా నుంచి ఇటీవల విడుదలైన హిట్ సినిమా వరకు అడివి శేష్ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
స్వతహాగా రైటర్, డైరెక్టర్ కావడంతోనో ఏమో అడివి శేష్ స్టోరీ సెలక్షన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. హీరో, సపోర్టింగ్ రోల్, విలన్, నెగెటివ్ పాత్రలు ఇలా యాక్టింగ్ స్కోప్ ఉండే ఏ పాత్రనైనా అడివి శేష్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం కూడా చేస్తాడు. నేను హీరోగా చేయాలి డైరెక్షన్ నాకెందుకు? నేను రైటర్‌ని హీరోగా నేను ఎందుకు చేసుకోవాలి అనుకోలేదు. తనలో ఉన్న టాలెంట్స్ అన్నింటిని ప్రేక్షకుల ముందు పెట్టేశాడు. చాలా తక్కువ సమయంలోనే అడివి శేష్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్(క్షణం)గా నంది అవార్డు, క్షణం సినిమాకే ఫైమా ఉత్సవంలో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు, గూఢచారి సినిమాకి జీ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సొంతం చేసుకున్నాడు.
అసందర్భంగా, అస్సలు సంబంధం లేకుండా అడివి శేష్ కెరీర్ గురించి ఇప్పుడు ఎందుకు ఏకరువు పెట్టావ్? అంటూ పెదవి విరవకండి. అందుకు కారణం ఉంది. శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లోకి అడివి శేష్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హిట్ సెకండ్ కేస్‌లో కృష్ణదేవ్ అలియాస్ కేడీగా అడివి శేష్ నటించి మెప్పించాడు. ప్రస్తుతం హిట్ యూనిట్ మొత్తం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. శేష్ కూడా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ.. హిట్ సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఆస్క్ శేష్ అని ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. అందులో మీకు నచ్చిన తెలుగు హీరో ఎవరు? అని అడగ్గా అందుకు అడివి శేష్ నేనే అని సమాధానం చెప్పాడు.
Me. #AskSesh https://t.co/txvdYJ5kzD
— Adivi Sesh (@AdiviSesh) December 3, 2022
ప్రస్తుతం అడివి శేష్ చెప్పిన సమాధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్త ఎక్కవగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గురించి తప్పకుండా ఒప్పుకోవాలి. అదేంటంటే ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉండాలి. సాధించగలననే పట్టుదల ఉండాలి. ఎప్పుడూ ఒకరిని చూసి ఇన్‌స్పైర్ కావడమేనా? మనకి మనమే ఎందుకు రోల్ మోడల్ కాకూడదు? ఎప్పుడూ ఒకర్ని చూసి నువ్వు ఇన్‌స్పైర్ అయితే నిన్ను చూసి ఎవరు అవుతారు? ఒక యాక్టర్‌గా, ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా ఇప్పటికే అడివి శేష్ తనని తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతని ఫేవరెట్ అతనే ఎందుకు కాకూడదు? టాలీవుడ్ లో అతి తక్కువ ఆల్రౌండర్లలో అడివి శేష్ కూడా ఒకడు. కాబట్టి అతనిది కచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రమే అవుతుంది- ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాల్సిన అవసరం లేదు.