తెలుగు హీరోయిన్ అనగానే.. ముంబయి, దిల్లీ, కేరళ ఇలా పరభాషలకు చెందిన భామలే కనిపిస్తారు. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పట్లో ఇది ఆగకపోవచ్చు. అయితే వేరే భాషలకు చెందిన బ్యూటీస్ అంటే వాళ్లకు అస్సలు తెలుగు రాదు. ఒకవేళ నేర్చుకున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆ వచ్చిన రెండు ముక్కలు చెప్పడం తప్పించి, పెద్దగా మాట్లాడే పనుండదు. ఇది చాలామందికి తెలిసినా సరే బయట దీని గురించి మాట్లాడుకోరు. కానీ హీరో అడివి శేష్ మాత్రం అదే విషయమై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అడివి శేష్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘హిట్ 2’. డిసెంబరు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. టీజర్ ని గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అని టీమ్ అంతా చాలా విషయాలు మాట్లాడింది. వాళ్లని చూస్తుంటే చిత్రంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే ‘హిట్ 2’లో హీరోయిన్ మీనాక్షి చౌదరి చేసింది. చూడటానికి ఈమె తెలుగమ్మాయిలా కనిపించినప్పటికీ.. ఈమెని ముంబయి నుంచి తీసుకొచ్చారు.
ఇక ఈమె గురించి ప్రశంసిస్తూ మాట్లాడిన హీరో అడివి శేష్.. ముంబయి నుంచి వచ్చే మిగతా కథానాయికల గురించి నిజం బయటపెట్టేశాడు. ‘ముంబయి వాళ్లు ఉంటారు కదా, ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు. కానీ మీనాక్షి అలా కాదు. అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడింది’ అని అడివి శేష్ చెప్పాడు. దీంతో నెటిజన్స్.. టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ముంబయి బ్యూటీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘శేష్ భయ్యా.. పొరపాటున నిజం చెప్పేశావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.