తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. ఈ చిత్రం చూసి ఎంతో మంది నటులు, రాజకీయ నేతలు పలు క్రీడారంగానికి చెందిన వారు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకొని తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ లీస్ట్ లో హీరో, దర్శకుడు ఆదిత్య ఓం కూడా చేరాడు.
తెలుగు ఇండస్ట్రీలో లాహిరి లాహిరి లాహిరలో చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య ఓం. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. దాంతో కొన్ని చిత్రాల్లో సైడ్ హీరోగా కూడా నటించారు ఆదిత్య ఓం. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. 2018 లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ కెరీర్ లో ఎక్కువ సక్సెస్ సాధించలేకపోయాడు ఆదిత్య ఓం.
ఇటీవల ఆదిత్య ఓం పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు గ్రామాలను దత్తత తీసుకొని తన వంతు సహాయం అందిస్తున్నాడు. అంతేకాదు అక్కడ ప్రజలు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని చలించిపోయారు. ఈ క్రమంలో 5 గ్రామాలకు అంబులెన్స్ సేవలను అందించేందుకు ఆదిత్య ఓం శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న సేవలకు అక్కడి ప్రజలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.