స్టార్ కిడ్స్ సినిమాల్లోకి రావటం అన్నది సర్వసాధారణ విషయం. ఇక, తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌లుగా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ దగ్గరినుంచి చిరంజీవి, నాగార్జున వరకు వారి తనయులు సినిమాల్లోకి వచ్చారు. వీరిలో చాలా మంది స్టార్‌లుగా కూడా మారారు. ఈ నేపథ్యంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి రానున్నాడని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ, మోక్షజ్ఞ కంటే ఎక్కువ ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తమ హీరో కుమారుడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా? ఎప్పుడు నెత్తిన పెట్టుకుందామా అన్న ఇదిలో ఉన్నారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఆ సినిమాపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్‌కూడా ఆ సినిమా గురించి ఆలోచించటం మానేశారు. ఇలాంటి టైంలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోక్షజ్ఞ సినిమాపై ఓ ఫుల్ క్లారిటీ వచ్చినట్లు ఆ వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు బాలయ్య బాబు దర్శకత్వం వహించనున్నారట. తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకు కొనసాగింపు సినిమాతో కుమారుడ్ని పరిశ్రమకు పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఆదిత్య 369కు కొనసాగింపుగా.. ఆదిత్య 999 రానుందట.
ఆదిత్య 999 సినిమాపై చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆదిత్య 369కు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉందని చెప్పనే చెప్పారు. ఇక, బాలకృష్ణ ‘ఆదిత్య 999’ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. స్వయంగా బాలయ్య బాబే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని భావిస్తున్నారట. మొదటి సినిమాతోనే తన కుమారుడికి మంచి గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. యూనివర్శల్ రిలీజ్‌కు స్కోప్ ఉన్న కథ కాబట్టి ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇక, బాలయ్య బాబు, మోక్షజ్ఞ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కింది. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు చిత్ర సీమలో మైలు రాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాను అప్పట్లోనే 1.52 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చాలా కష్టపడ్డారు. తాను చదివిన హెచ్ జీ వెల్స్ రాసిన ‘‘ది టైం మిషిన్’’ నవల ఆధారంగా కథను రాసుకోవటం మొదలుపెట్టారు. ఎంతో రీసెర్చ్ చేసి కథను సిద్ధం చేశారు. బాలకృష్ణ హీరోగా.. మోహిని హీరోయిన్‌గా సినిమాను తీయటం మొదలుపెట్టారు. ఇందులో అమ్రిష్ పురి విలన్‌గా నటించారు. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 1.52 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా 9 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సినిమాకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి. తర్వాత హిందీ, తమిళంలోనూ డబ్ అయింది.