దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. రామనామంతో దేశమంతా జపిస్తోంది. ఇటువంటి సమయంలో కొన్ని ఫేక్ స్టేట్ మెంట్స్ ప్రేక్షకులను ఆందోళనలో పడేశాయి. ఇటువంటి తప్పుడు వార్తలపై ఆదిపురుష్ టీమ్ ఘాటుగా స్పందించింది.
డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతిసనన్ అలరించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. పురాణాల్లోని రామాయణ గాథ ఆదారంగా ఆదిపురుష్ ను తెరకెక్కించారు. రాముడి గొప్పతనాన్ని ఇప్పటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఇంతటి గొప్ప సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సందడి మొదలైంది. ఈ తరుణంలో కొందరు ఈ సినిమా గురించి తప్పుడు స్టేట్ మెంట్స్ ఇస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు.
జూన్ 16న విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమా ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ఈ సినిమాను వివాదాల్లోకి నెడుతున్నాయి. నిన్న (మంగళవారం) తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడక ప్రభాస్ అభిమానుల్లో మరింత జోష్ నింపింది. అయితే ఈ రోజు సినిమా డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతిసనన్ ను తిరుమల కొండపై ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. ఇప్పుడు తాజాగా మరో ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఆ ఫేక్ స్టేట్ మెంట్ లో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేశారు. ‘రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన ఆదిపురుష్ ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం అని ఫేక్ పోస్టర్ ని సృష్టించారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఆదిపురుష్ సినిమా టీమ్ స్పందించింది. ఈ పోస్టర్ ను తాము విడుదల చేయలేదని, తప్పుడు సమాచారంతో కొంతమంది వివాదాలు సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. ఆ ప్రకటనను ఎవరూ నమ్మవద్దని, కులం, మతాల మధ్య వివక్షచూపకుండా సమానత్వం కోసం కట్టుబడి ఉంటుందని ఆదిపురుష్ బృందం తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారాలను మీరు నమ్మవద్దని, ఇటువంటి వాటిని ఎదుర్కోవడంలో మాకు సహాయం చేయాలని ఆదిపురుష్ టీమ్ ఓ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉండగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. 10వేలకు పైగా సినిమా టికెట్స్ ప్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు 10వేల+ టికెట్లు ఫ్రీగా అందిస్తామని ప్రకటించారు.