ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ గ్రాఫిక్ వర్క్ వల్ల వాయిదా పడింది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సాధారణ ప్రేక్షకులతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్‌ను కూడా నిరాశపర్చాయి. అన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమా గ్రాఫిక్ క్వాలిటీ ఇలా ఉందేంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. రామలక్ష్మణులు, సీతాదేవి, హనుమంతుడి పాత్రలను సరిగ్గా చూపించట్లేదని, వారి గెటప్స్ మీదా విమర్శలు వినిపించాయి. దీంతో జాగ్రత్త పడిన ‘ఆదిపురుష్’ యూనిట్ తప్పుల్ని సవరించుకునేందుకు, గ్రాఫిక్ క్వాలిటీని పెంచేందుకు రిలీజ్‌ను వాయిదా వేసింది.
తాజాగా ‘ఆదిపురుష్’ నుంచి కొత్త లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు. శ్రీరాముడి గొప్పతనాన్ని చెబుతూ సాగే ఈ గీతానికి సంబంధించిన వీడియో బాగుంది. ‘నీ సాయం మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం’ అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. కానీ కాస్త హిందీ డబ్బింగ్ పాట వింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ బాణం పట్టుకున్న రాముడి గెటప్‌లో వీరోచితంగా కనిపిస్తున్న ప్రభాస్ లుక్, మ్యూజిక్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ నుంచి ఇంతకుముందు విడుదలైన ప్రచార చిత్రాల కంటే ఇది చాలా మెరుగ్గా ఉందని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. మీరు ‘ఆదిపురుష్’ లిరికల్ మోషన్ పోస్టర్ చూశారా? ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.