సెలబ్రిటీలు బయటకనిపించారంటే జనాల తాకిడి తట్టుకోవడం కష్టం. షేక్‌హ్యాండ్ ఇవ్వడం కోసం, సెల్ఫీలు తీసుకోవడం కోసం పోటీ పడుతుంటారు. అందుకే బిగ్ స్టార్స్ బాడీగార్డ్స్ లేనిదే బయటకి రారు.
సెలబ్రిటీలు బయటకనిపించారంటే జనాల తాకిడి తట్టుకోవడం కష్టం. షేక్‌హ్యాండ్ ఇవ్వడం కోసం, సెల్ఫీలు తీసుకోవడం కోసం పోటీ పడుతుంటారు. అందుకే బిగ్ స్టార్స్ బాడీగార్డ్స్ లేనిదే బయటకి రారు. సినిమా ఫంక్షన్లలో స్టేజీ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చెయ్యడం.. పబ్లిక్‌లో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చూశాక చాలా మంది హీరోలు ప్రైవేట్ సెక్యూరిటీని మెయింటెన్ చేస్తున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులకు అలాంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు వాళ్లను వాళ్లే సేవ్ చేసుకోవాలి. కొన్ని సార్లు ఇబ్బందులు పడ్డ సంఘటనలు కూడా జరిగాయి. రీసెంట్‌గా ఓ తెలుగు నటికి ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధ భీమిరెడ్డి ప్రేక్షకులకు పరిచయమే.
‘అర్జున్ రెడ్డి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘క్రష్’ వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీసుధ ఫిజియోథెరపిస్ట్ కూడా. ఈమధ్య విమానంలో ప్రయాణిస్తున్న శ్రీసుధను ఓ వ్యక్తి తన బిహేవియర్‌తో ఇబ్బందులకు గురి చేశాడు. తన వెనుక సీట్లో కూర్చున్న అతను అదే పనిగా కాళ్లు ముందుకు చాపుతూ, శ్రీసుధను తాకడానికి ప్రయత్నించాడు. అప్పటికీ పలుమార్లు కాళ్లు తగులుతున్నాయని హెచ్చరించినా.. అతడు మళ్లీ మళ్లీ అలాగే చేశాడు. సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇక మాటలతో చెప్తే లాభం లేదని గ్రహించి, తన పంచ్ పవర్ రుచి చూపించింది. అసలేం జరిగింది?, ఆ వ్యక్తి తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది.
ఫోటోలో శ్రీసుధ వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి తన రెండు కాళ్లను ఆమె సీటు కింద పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘దీనిపై ఎలా స్పందించాలి? సిబ్బందికి రెండు సార్లు చెప్పి చూశాను. అయినా అతడి మెంటాలిటీ మారలేదు. అందుకే లాగి ఒక్కటిచ్చాను. అతడి బొక్కలు (ఎముకలు) విరిగితే మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘మంచి పని చేశావ్’ అని కొందరు.. ‘ఇంత చిన్న విషయానికి అంత రాద్దాంతం అవసరమా? అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది కదా’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ‘నాకు ఆ మాత్రం తెలీదా? అప్పటికే రెండుసార్లు చెప్పి చూశాను. కానీ వాళ్లు పట్టించుకోలేదు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.