ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువయి పోయాయి. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి సోనా చక్రవర్తి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఉదయం కార్డియాక్ అరెస్ట్ కారణంగా సోనాలి మరణించారు. సోనాలి మృతితో బెంగాలీ ఇండస్ట్రీ(టాలీవుడ్)లో విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోనాలి మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.
బెంగాల్ చిత్ర నటీనటుల సంఘం సోనాలి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. ఇక, సోనాలి అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. కోల్‌కతాలోని కియోరటోలా శ్మశాన వాటికలో తుది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, సోనాలి బెంగాలీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. సీరియల్స్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు! పలు సినిమాల్లోనూ నటించారు. రచన బెనర్జీ, ఫెర్డస్ అహ్మద్ నటించిన ‘‘హర్ జీత్’’ సినిమాలో ఆమె నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. 2004లో వచ్చిన బంధన్ సినిమాలోనూ ఆమె కీలక పాత్ర చేశారు. అనారోగ్యం కారణంగా ఆమె పలు సీరియల్స్, సినిమాలతో పాటు షోలకు కూడా దూరమయ్యారు. ఈ విషయాన్నే ఓ ఇంటర్వ్యూలో ఆమె భర్త, ప్రముఖ నటుడు శంకర్ చక్రవర్తి వెల్లడించారు.