సినిమా షూటింగ్ అంటే సాధారణ విషయం కాదు. ఓ రెండు గంటల సినిమా తీయటానికి కొన్ని నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఒక్కో షాట్ కోసం అవసరమైతే పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వస్తుంది. దర్శకుడికి ఆ షాట్ నచ్చకపోతే అంతకంటే ఎక్కువ టేకులే తీసుకోవాల్సి వస్తుంది. షూటింగ్‌లో ప్రమాదాలు కూడా సర్వసాధారణం. యాక్షన్ సీన్స్ దగ్గరినుంచి చిన్న చిన్న సీన్ల చిత్రీకరణ సందర్భంగా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ నటి సన్నీ లియోన్ షూటింగ్‌లో గాయపడింది. ఆమె కాలి బొటన వేలుకు గాయం అయింది.
ఈ ఘటన మరువక ముందే మరో ప్రముఖ నటి సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురైంది. బంగ్లాదేశీ నటి షర్మీన్ అకీ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ శరా వేగంగా జరుగుతోంది. ఆమె మీర్‌పుర్‌లో షూటింగ్‌లో ఉండగా.. మేకప్ రూములో పేలుడు సంభవించింది. దీంతో సెట్‌లో మొత్తం మంటల వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మంటల్లో చిక్కుకుంది. దీంతో ఆమె కాళ్లు, చేతులు, వెంట్రుకలతో పాటు ఇతర భాగాలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమెను షేక్ హసీనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రికి తరలించారు.
షర్మీన్ శరీరం 35 శాతం కాలిపోయినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అంతేకాదు! ఆమె శరీరం చికిత్సకు స్పందించటం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను హై డిపెండెన్సీ యూనిట్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఆమె శరీరంలో ప్లాస్మా శాతం తగ్గిపోవటంతో ప్లాస్మా ఎక్కించామన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా, 27 ఏళ్ల షర్మీన్ బంగ్లాదేశ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటి. ‘సిన్సియర్లీ యువర్స్, ఢాఖా, బైషే శ్రబాన్, బందిని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షర్మీన్ బుల్లితెరలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, షర్మీన్ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ మీ ప్రార్థనలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.