సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అప్పటి వరకు టాప్‌లో ఉన్న హీరోయిన్.. ఒక్క ప్లాపుతో అథఃపాతాలానికి పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లితో వారి సినీ జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. పెళ్లి తర్వాత సినిమానా? కుటుంబమా? అన్న ప్రశ్న వచ్చినపుడు నూటికి 90 శాతం మంది సినిమాలకు గుడ్‌బై చెబుతుంటారు. అలా పెళ్లి తర్వాత సినిమాకు దూరమైన హీరోయిన్స్‌లో శరణ్య మోహన్ ఒకరు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు సినిమాల్లో బాల నటిగా పని చేశారు. 2005లో వచ్చిన ‘ఒరు నాల్ ఒరు కనవు’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.
ఆకట్టుకునే సపోర్టింగ్ రోల్స్ చేసి పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. శరణ్య తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. ఆమె హీరోయిన్‌గా మారింది కూడా తెలుగు సినిమాతోనే కావటం విశేషం. 2009లో వచ్చిన ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. శరణ్య మోహన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమానే.
ఈ సినిమా తర్వాత ఆమె ఓ రెండు తెలుగు సినిమాల్లో నటించారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. కొన్ని సీరియల్స్‌లోనూ నటించారు. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. శరణ్య తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాకు పూర్తిగా దూరం అయ్యారు. ఈ దంపతులకు ఓ పాప, ఓ బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తన కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.