ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు దర్శకులు చెప్పింది చేయాలి. లేదంటే చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. నటి సనా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదురుకున్నారట. తనను కూడా దర్శకులు ఇబ్బందులు పెట్టారని.. పొట్టి బట్టలు వేసుకుని ఆ పని చేయమన్నారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నటి సనా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎప్పుడూ బిజీగా ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. కృష్ణవంశి తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సనా మళ్ళీ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించారు. సనా పూర్తి పేరు షానూర్ సనా బేగం. తల్లి ముస్లిం, తండ్రి క్రిస్టియన్. పదో తరగతిలోనే సనా వివాహం జరిగింది. అయితే మొదటి నుంచి నటించాలన్న ఆసక్తి ఉన్నా ముస్లిం కుటుంబం, సంప్రదాయాలకు విలువ ఇచ్చి తన ఆశలను వదులుకున్నారు.
అయితే తన ఆశల గురించి అత్తా, మామలకు చెప్తే ప్రోత్సహించారని.. తనను చదివించడమే కాకుండా ఇష్టమైన రంగంలోకి వెళ్లేందుకు అంగీకరించారని రీసెంట్ ఇంటర్వ్యూలో సనా వెల్లడించారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన సనా బుల్లితెర మీద యాంకర్ గా చేసి.. ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు ఇలా ఏం చేసినా తనను అత్తమామలు బాగా ప్రోత్సహించారని అన్నారు. మీ కోడలు బురఖా వేసుకోవట్లేదేంటి? బురఖా వేసుకోకుండా బయట తిరుగుతుందేంటి? అని అత్తమామలను అవమానించేవారని.. అయినా గానీ వారు వాటన్నిటినీ భరించి తనకు తోడుగా ఉన్నారని అన్నారు. ఇక తనకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని.. అప్పటికే పెళ్ళై పిల్లలున్నా ఆ విషయాన్ని చెప్పొద్దని అన్నారని.. కానీ తాను నిజం చెప్పడం వల్ల హీరోయిన్ అవకాశాలు పోయాయని సనా వెల్లడించారు. అయితే హీరోయిన్ అవకాశాలు పోయినందుకు బాధపడలేదని అన్నారు.
ఇంకొన్ని సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయమని బలవంతం చేశారని.. స్విమ్ సూట్ వేసుకోమన్నారని.. కానీ కుదరదని చెప్పడంతో చాలా అవకాశాలు పోయాయని అన్నారు. తాను మొదట ఇండియన్ ని అని.. తన పిల్లల్ని కూడా ఇండియన్స్ గానే పెంచానని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న హిందూ, ముస్లిం అని అప్పట్లో లేదని.. తాను ఎక్కడికి వెళ్లినా ఇండియన్ అనే చెప్పుకుంటా అని.. పిల్లలకు కూడా అదే నేర్పించానని ఆమె అన్నారు. ముస్లిం కాబట్టి హిందూ దేవతల పాత్రలు చేయకూడదు అని నియమం పెట్టుకోలేదని.. శ్రీరామరాజ్యంలో కైకేయిగా నటించానని.. ఆది పరాశక్తి అమ్మవారి పాత్ర చేశానని అన్నారు. ఆ అమ్మవారే తనను ఎంచుకున్నప్పుడు.. చేయను అని అనడానికి తానెవరినీ అని.. అందుకే అమ్మవారి పాత్రలో నటించానని అన్నారు. తిరుపతికి వెళ్లానని.. నడుచుకుంటూ కూడా వెళ్లానని.. తన ఇంట్లో అందరూ తనలానే ఉంటారని ఆమె వెల్లడించారు. మరి ఇంత పరిపక్వత కలిగిన నటి సనాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.