తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆరేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో 90కు పైగా సినిమాల్లో నటించింది. ఇటీవల భర్త విద్యాసాగర్ మృతితో పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇలాంటి సమయంలో మీనా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అందరినీ అదే దారిలో నడవాలంటూ చైతన్యం కలిగిస్తోంది.
మీనా భర్త అనారోగ్యంతో కాలం చేసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సంబంధిత కారణాలతో మరణించినట్లు తెలిపారు. తన భర్త మరణం తర్వాత మీనా తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా.. ఆదివారం అందుకు సంబంధించిన ప్రకటన చేసింది. తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో తాను ఆర్గాన్ డోనర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. అందరూ ఆర్గాన్ డోనర్లు కావాలంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
“ప్రాణాలు కాపాడటం కంటే గొప్ప పని ఇంకొకటి ఉండదు. అవయవదానం అనేది అవతలి వారి ప్రాణాలు నిలబెట్టే అద్భుత కార్యక్రమం. అవయవదానంతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే.. సాగార్ బతికుండే వాడేమో.. మా జీవితం ఇంకోలా ఉండేది. ఒక వ్యక్తి చేసే అవయవదానంతో 8 మంది ప్రాణాలు కాపాడవచ్చు”.
“అందరూ అవయవదానం గొప్పతనం గురించి గ్రహించి ముందుకొస్తారని భావిస్తున్నాను. ఇది కేవలం డోనర్లు, అవయవాలు పొందే వారు, వైద్యుల మధ్య జరిగేదే కాదు. మీరు చేసే అవయవదానం కొన్ని కుటుంబాలు, మిత్రుల జీవితాలను మార్చగలదు. నేను నా అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను.” అంటూ మీనా పోస్ట్ చేసింది. మీనా అవయవదానానికి ముందుకు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.