బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సితో వార్తల్లో నిలిచే కంగనా.. ఈసారి ఆమెను చంపుతామని బెదిరింపులు వస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. మరి ఇంతకీ కంగనా ఇంతలా కంగారు పడటానికి కారణం ఏమయ్యుంటుంది.. అంటే సాగుచట్టాలను రద్దు చేయాలనీ రైతులు చేస్తున్న నిరసనపై కంగనా పెట్టిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణమయ్యాయని అంటోంది. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కంగనా మంగళవారం పంజాబ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
దేశ ద్రోహులకు, అమాయకులైన జవాన్లను బలి తీసుకునే నక్సలైట్లకు తాను ఎల్లప్పుడూ వ్యతిరేకమేనని కంగనా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అలాగే విదేశాల్లో ఉండి ఇండియాలో ఖలిస్థాన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు వేసే ఉగ్రవాదులను విమర్శిస్తాను. ఇలాంటి ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ఎవరికీ భయపడనని ఈ ఫైర్ బ్రాండ్ రాసుకొచ్చింది. ఇటీవలే తనను చంపేస్తానని పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి బహిరంగంగా ప్రకటించినట్లు కంగనా తెలిపింది. అంతేగాక కంగనా పోస్టులో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీకి కూడా ఓ విన్నపం తెలుపుకుంది.
గతంలో ఇందిరా గాంధీ కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకునేలా పంజాబ్ సీఎంకు సూచించాలని సోనియా గాంధీకి కంగనా విన్నవించుకుంది. సోషల్ మీడియాలో కంగనా పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా.. కంగనా నటించిన తలైవి చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం కంగనా దాకడ్ – తేజస్ – తను వెడ్స్ షేర్ చిత్రాల్లో నటిస్తోంది.