సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పదుల సంఖ్యలో నటీ, నటులు వస్తుంటారు. అయితే వీరిలో హీరోలు మాత్రం తెలుగు వారే అయినప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటారు. అలా అని టాలీవుడ్ లో టాలెంట్ వున్న అమ్మాయిలు లేరని కాదు. ఎప్పటి నుంచో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. తాజాగా ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారని, వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
జీవిత రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ శివాత్మిక, స్వాతి, దివ్య శ్రీపాద, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రంలో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. డిసెంబర్ 9 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ హరీశ్ శంకర్, నటి జీవిత రాజశేఖర్ లు హాజరయ్యారు. ఈ వేడుకలో జీవిత మాట్లాడుతూ..”నా చిత్ర బృందమే నాకు ఫ్యామిలీ లాంటింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు తెలుగు అమ్మాయిలే నటించారు. తెలుగు చాలా మంది టాలెంటెడ్ అమ్మాయిలు ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాలి” అని నవ్వుతూ హరీశ్ శంకర్ కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన హరీశ్..”ఓ కథా రచయితగా నేను ఎప్పుడూ తెలుగు వారినే ప్రోత్సహిస్తుంటాను. కాక పోతే కొన్ని పరిస్థితుల వల్ల వారికి నేను న్యాయం చేయలేక పోతున్నాను. ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన సినిమా గద్దల కొండ గణేశ్ లో తెలుగు అమ్మాయి డింపుల్ హయాతీకి అవకాశం ఇచ్చినట్లు డైరెక్టర్ హరీశ్ శంకర్ గుర్తు చేశాడు. ప్రస్తుతం ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. పంచతంత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమా, మూవీ టైటిల్ పెట్టడంలోనే డైరెక్టర్ సగం విజయం సాధించారని హరీశ్ శంకర్ పేర్కొన్నాడు.