నేటి కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ సమాజంలో ఆడవాళ్లు.. గౌరవంగా బతకాలనుకోవడం అత్యాశే అనిపిస్తోంది. కుటుంబ పోషణ కోసమే, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో.. ఆడవారు పని చేయాల్సి వస్తోంది. కానీ పని చేసే చోట వారు ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవి మరి కాస్త ఎక్కువ. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించారు. తాజాగా మరో నటి ఈ జాబితాలో చేరారు. ఆ వివరాలు..
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. దూరం నుంచి చూసే వారికి.. ఇక్కడ చాలా బ్రహ్మండంగా ఉన్నట్లు.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే అవన్ని పైపై మెరుగులు అని చాలా మందికి తెలియదు. వాటిని చూసి ఆకర్షితులై.. తారా పథంలో వెలిగిపోవాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెడతారు. ఆ తర్వాత తెలుస్తుంది.. తాము దిగింది ఊబిలోకి అని. అసలు ఆడవాళ్లు బయట అడుగుపెడితే చాలు.. ఎన్నో పాపిష్టి కళ్లు వారిని వెంటాడతాయి. ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. దాన్ని వాడుకుని.. వారి జీవితాలను నాశనం చేయడానికి కాచుకుని కూర్చుంటారు. అన్ని రంగాల్లోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయి. కానీ సినిమా రంగంలో అవి కాస్త ఎక్కువ. కొన్నాళ్ల క్రితం వరకు ఇలాంటి వేధింపుల గురించి బయటకు చెప్పడానికి చాలా మంది భయపడేవారు. అయితే మీటూ ఉద్యమం కారణంగా.. పరిస్థితి మారింది. చాలా మంది బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వేధింపుల గురించి వెల్లడిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఖుష్బు, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి టాప్ సెలబ్రిటీలు.. తమ జీవితంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు ప్రముఖ బుల్లితెర నటి జీవిత. ప్రస్తుతం ఈమె తమిళ్ సీరియల్స్ నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు ఎదురైన అనుభవం గురించి తాజాగా వెల్లడించింది జీవిత. ఈ సంఘటన తర్వాత తనకు జీవితం మీదనే విరక్తి కలిగిందని.. దారుణంగా అవమానించబడ్డట్లు అనిపించింది అని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ..‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు నాకు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. తొలి ప్రయత్నంలోనే హీరోయిన్ చాన్స్ అంటే.. ఎంత అదృష్టం ఉండాలి.. ఆఫర్ గురించి వినగానే ఎగిరి గంతేశాను. నా సంతోషానికి హద్దులే లేవు. ఆ తర్వాతే నాకు అర్థం అయ్యింది. అయితే అది నేను అనుకున్నట్లు.. సరైన ఆఫర్ కాదు.. అక్కడ ఒక మెలిక ఉంది. దర్శకుడు నా దగ్గరకు వచ్చి.. నీకు మంచి పాత్ర ఇస్తాను.. భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూసుకుంటాను.. రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇస్తాను.. కానీ నీవు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ కావాలి అన్నారు. నాకు అర్థం కాలేదు.. అడ్జస్ట్ అవ్వడం అంటే ఏంటి అని అడిగాను. ఆయన సమాధానం విన్నాక.. నేనేంత దారుణంగా అవమానించబడ్డానో అర్థం అయ్యింది’’ అని చెప్పుకొచ్చింది జీవిత.
‘‘ఆ దర్శకుడు మాట్లాడుతూ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏం లేదు.. నీవు నిర్మాత, మేనేజర్, కెమరామ్యాన్‌తో కలిసి ఉండాలి. వారు నీ గదికి ఎప్పుడైనా వస్తారు. వారిని సంతోషపెట్టాలి.. అన్నాడు. అతడి మాటల్లోని ఉద్దేశం నాకు పూర్తిగా అర్థం అవ్వడంతో.. భయంతో ఏడ్చాను. ఆ నిమిషం నేను ఎంత దారుణంగా అవమానించబడ్డానో.. ఎంతలా కించపరచబడ్డానో అర్థం అయ్యింది. మీ చెత్త ఆఫర్ నాకు అవసరం లేదని అక్కడ నుంచి వచ్చేశాను. కానీ ఆ అవమానాన్ని చాలా రోజుల పాటు మర్చిపోలేక పోయాను’’ అని చెప్పుకొచ్చింది జీవిత. మరి ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.