సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ అనేది సర్వ సాధారణం. అంతేకాక సెలబ్రిటీలు.. తమ కుటుంబ సభ్యులను సైతం వెండితెరకు పరిచయం చేస్తుంటారు. ఆలా వచ్చి.. సినిమాల్లో నిలదొక్కున్ని కొందరు మంచి పేరు సంపాందించుకుంటే మరికొందరు కనుమరుగయ్యారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా అలాంటి వారిలో జాబితాలో నటి నిశాంతి చేరింది. నిశాంతి అంటే ఎవరు గుర్తుపట్టక పోవచ్చు..కానీ అలనాటి నటి భానుప్రియ సోదరి శాంతి ప్రియ అంటే గుర్తు పట్టని వాళ్లు ఉండరు. 1990 ప్రాంతంలో కోలీవుడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తనదైన నటనతో, పక్కింటి అమ్మాయిగా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే తాజాగా ఆమె మరోసారి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నిశాంతి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ఎంగ ఊరు పాటుక్రన్ చిత్రం ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. నేరం నల్లా ఇరుక్కు, రైలుక్కు నేరమాచ్చు, సిగరెట్టు, తాళి వంటి పలు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఎక్కువ తమిళ సినిమాలో నటించింది. అప్పట్లో ఆమెకి కుర్రాళ్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోను ‘మహార్షి’ సినిమాతో వెండితెరపై మెరిసింది. అనంతరం సింహస్వప్నం, రక్త కన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని వంటి చిత్రాల్లో నటించి..తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. హిందీలో కూడా మేరే సజనా సాత్ నిభానా, ఫూల్ ఔర్ అంగార్, మెహెర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 1999లో వి.శాంతారాం మనవడైన సిద్ధార్ధ రాయ్ ను వివాహం చేసుకుంది. వివాహానంతరం నటనకు దూరమై, సంసార జీవితంపై దృష్టి సారించింది.
చాలాకాలం విరామం తరువాత మళ్లీ మేకప్ వేసుకునేందుకు నిశాంతి సిద్ధమయ్యారు. ఇటీవల ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో సునీల్ శెట్టి చెల్లిలి పాత్రలో నిశాంతి నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నిశాంతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె నటనపై పలువురు ప్రముఖల నుంచి ప్రశంసలు అందాయి. ఇలాంటి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందని నిశాంతి తెలిపారు. ప్రస్తుతం స్వాతంత్య్ర సమర యోధురాలు, సుప్రసిద్ధ కవయిత్రి సరోజిని నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం..”సరోజిని నాయడు ది అన్ సాంగ్ ప్రీడమ్ ఫైటర్” ద్వారా నిశాంతి తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటించనున్నట్లు సమాచారం.