సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా సీనియర్ నటి అనురాధ.. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. నటి, మోడల్, డాన్సర్ అయినటువంటి అనురాధ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1970 – 90ల పీరియడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. నటిగా కంటే అనురాధ గారు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ ద్వారానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.
అందం, అభినయం కలిగిన అనురాధ.. ఆ రోజుల్లోనే ఐటమ్ సాంగ్స్ కి డిమాండ్ తీసుకొచ్చి.. ఒక్కో సాంగ్ కి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడంటే ఐటమ్ సాంగ్స్ కి కోట్లు తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో లక్ష రూపాయలంటే కోటిలా భావించేవారని అనురాధ చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు దాదాపు 7 భాషల్లో అనురాధ ఐటమ్ నంబర్స్ లో ఆడిపాడారు. మరి అనురాధ ఐటమ్ సాంగ్ అంటే.. ఫ్యాన్స్ లో ఆ ఊపు వేరే లెవెల్లో ఉండేది. టాప్ టు బాటమ్ గ్లామర్ ట్రీట్ తో మగాళ్లను థియేటర్లకు రప్పించేవారు. అయితే.. అనురాధ ఐటమ్ సాంగ్స్ చేసే టైంలో డిస్కో శాంతి, సిల్క్ స్మిత కూడా ఈమెకు పోటీగా ఉన్నారు.
తాజా ఇంటర్వ్యూలో అనురాధ.. 80స్ సినిమా లవర్స్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ అయిన సిల్క్ స్మిత డెత్ మిస్టరీ గురించి ప్రస్తావించారు. సిల్క్ స్మిత చనిపోవడం అనేది ఇన్నేళ్లయినా మిస్టరీగానే ఉండిపోయింది. ఆమెతో మీ బాండింగ్ ఎలా ఉండేది? అనే ప్రశ్నకు స్పందించిన అనురాధ.. “సిల్క్ స్మిత నాకు అంత క్లోజ్ కాదు కానీ మంచి ఫ్రెండ్. తను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు.. రిజర్వుడ్ గా ఉండేది. తన పర్సనల్ విషయాలు అసలే షేర్ చేసుకోదు. ఆమె అలా ఉంటుంది కాబట్టి మేం కూడా పెద్దగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేదు. బయటికి పొగరు అనుకుంటారు కానీ చిన్న పిల్లల మనస్తత్వం తనది.
సిల్క్ చనిపోవడానికి ముందురోజు నైట్ నాకు ఫోన్ చేసింది. అప్పుడంతా ల్యాండ్ లైన్ లోనే కదా. ఏం చేస్తున్నావ్? అని అడిగింది. మా ఆయన బెంగుళూరు నుండి వస్తున్నాడు ఇంట్లోనే వెయిట్ చేస్తున్నా అని చెప్పా. నువ్ కొంచం ఇంటికి రాగలుగుతావా ఇంటికి? అని అడిగింది. ఏంటి అర్జెంటు అయితే చెప్పు.. లేదంటే పాపను రేపు స్కూల్ లో వదిలిరానా? అని అన్నాను. ఇప్పుడు రాలేవా ? రేపు మార్నింగ్ తప్పకుండా వస్తావా? ఓకే అని పెట్టేసింది. తెల్లారి టీవీలో ఫ్లాష్ న్యూస్.. సిల్క్ స్మిత చనిపోయిందని.. అది చూసి షాకయ్యాను. అయ్యో ఏంటిలా అయిపోయింది.. ఒకవేళ నిన్న రాత్రి నేను వెళ్లుంటే ఏదైనా మాట్లాడి ఉండేదేమో.. ఎందుకిలా చేసిందని నాకు అర్థం కాలేదు. వెంటనే నేను, శ్రీవిద్య కలిసి బాడీని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారని తెలిసి విజయ హాస్పిటల్ కి వెళ్ళాం.
అక్కడ సిల్క్ స్మిత బాడీని ఒక నార్మల్ స్ట్రెక్చర్ లో పడుకోబెట్టారు. సిల్క్ స్మిత అందం, ఫిజిక్ అంటే ఎంత క్రేజ్.. అక్కడ ఆమె ముఖంపై ఈగలు వాలడం చూసి నేను, శ్రీవిద్య చలించిపోయాం. అంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక ఆర్టిస్ట్ లైఫ్.. ఆమె చనిపోయాక పరిస్థితిని చూసి బాధేసింది. సిల్క్ ఎప్పుడూ అది కొన్నా.. ఇది కొన్నా అని చెప్పేది కానీ.. తనకు ఇలాంటి బాధలున్నాయని ఏనాడూ చెప్పలేదు. చనిపోయే టైంకి తనకింకా పెళ్లి కాలేదు. నాకంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చేసింది” అంటూ సిల్క్ స్మితతో తనకున్న బాండింగ్ షేర్ చేసుకున్నారు అనురాధ. ప్రస్తుతం అనురాధ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సిల్క్ స్మిత గురించి అనురాధ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.