ఆమె యువ నటి. ఎంచక్కా ప్రయత్నాలు చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ అలా జరగకపోయేసరికి అడ్డదారి పట్టింది. పోలీసులకు దొరికిపోయింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోపాటు హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు తదితరుల్ని అధికారులు విచారించారు. అయితే అది కొన్నాళ్ల తర్వాత మరుగున పడిపోయింది. సరే అందరూ దీని గురించి మర్చిపోయారు అనుకునే టైంలో తాజాగా మరోసారి డ్రగ్స్ వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండస్ట్రీకి చెందిన ఓ నటిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అవకాశాల్లేక డబ్బుల కోసమే ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్, నటి అంజుకృష్ణ గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఈమెకు మూడేళ్ల క్రితం కాసర్ గోడ్ కు చెందిన షామీర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ దంపతులు అని చెప్పి ఉనిచ్చిరలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. సరైన అవకాశాలు రాకపోవడంతో బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కొచ్చిలో అమ్మడం మొదలుపెట్టారు. ఎక్కువ డబ్బు రావడంతో ఈ దందాని యథేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా పోలీసులకు వీరి గురించి సమాచారం అందింది. పోలీసులు చేసిన దాడిలో నటి డ్రగ్స్ వ్యవహారం గుట్టురట్టయింది.
ఉనిచ్చిరలోని అంజుకృష్ణ అద్దెకు ఉంటున్న ఇంటిపై సిటీ కమీషనర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేయగా.. 56 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ MDMAని గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు రావడం చూసి నటితో పాటే ఉంటున్న షామీర్ పరారయ్యాడు. ఈ సోదాల్లో భాగంగా నటి అంజుకృష్ణని అరెస్ట్ చేశారు. దీంతో చిత్రసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి నటి అంజుకృష్ణ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోవడం, పోలీసులు అరెస్ట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.