బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రి పాలైన ప్రముఖ నటి ఐంద్రిలా శర్మ పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది. ఆమె ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐంద్రిలా మంగళవారం పలు మార్లు హార్ట్ అటాక్స్‌కు గురయ్యారు. హార్ట్ అటాక్‌కు గురైన ప్రతిసారి వైద్యులు ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఐంద్రిలా జీవితంలో విషాదాలు కొత్తేమీ కాదు. ఆమె గతంలో రెండు సార్లు క్యాన్సర్‌కు గురైంది. ఆ రెండు సార్లు ఎంతో గుండె ధైర్యంతో క్యాన్సర్‌తో పోరాటం చేసి విజయం సాధించింది.
నవంబర్ 1న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఐంద్రిలా శర్మ అప్పటినుంచి కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి బాగోలేకపోవటంతో వైద్యులు ఆమెను అత్యవసర విభాగంలో ఉంచారు. కోమాలో ఉన్న ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. మెదడులో అక్కడక్కడా రక్తం గట్టకట్టిందని వైద్యులు తెలిపారు. ఇక, ఐంద్రిలా తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జుమూర్, భోలో, బాబా పర్ కరేగా లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ మంచి స్థితిలో కొనసాగుతున్న సమయంలో విధి వక్రించింది. ఆమెను ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలకు గురిచేస్తోంది. ఐంద్రిలా పరిస్థితికి ఆమె కుటుంబసభ్యులతో పాటు ప్రియుడు సభ్యసాచి చౌదరి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సభ్యసాచి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఐంద్రిలా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆమె త్వరగా కోలుకునేలా దేవుడ్ని ప్రార్థించాలని అభిమానులను కోరారు. అంతకు క్రితం ఓ పోస్టులో.. ఐంద్రిలా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమె తన ఫోన్ కాల్స్‌కు రిప్లై ఇస్తోందని తెలిపాడు. ఇంతలోనే ఆమె పరిస్థితి విషమించటం విషాదకరం.