సీనియర్ నటుడు శరత్ బాబు.. సోమవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆఖరి కోరిక గురించి నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా పాత్రలతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ నటుడు శరత్ బాబు. తెర మీద ఆయన కాకుండా.. ఆయన చేసిన క్యారెక్టర్సే కళ్ల ముందు మెదులుతాయి. అది శరత్ బాబు నటనలోని గొప్పతనం. సాగర సంగమం, సితార, సీతాకోక చిలుక చిత్రాల్లో శరత్ బాబు పండించిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తోడుగా నిలిచే హ్నేహితుడిగా, జమిందార్ కావాలని కలలు కనే పేద ధనికుడిగా, చెల్లెలి ప్రేమకు అడ్డుగా నిలిచే అన్నగా.. ఇలా వేరు వేరు రకాల భావోద్వేగాలను అవలీలగా పలికించి తన అద్భుత నటతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు.. మే 22, సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.
శరత్‌బాబు మూడు నెలల కిందట అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని అనంతరం బెంగళూరు వెళ్లారు. అయితే మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో.. బెంగళరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకోలేదు. రెండో సారి అనారోగ్యం పాలైన తర్వాత ఆయన ఇక తిరిగి కోలుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గత నెల 20న ఆయనను బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుకు పైగా శరత్ బాబుకు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.
అయితే తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో.. ఇన్‌ఫెక్షన్ ఆయన శరీరం అంతా వ్యాపించింది. దాంతో ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతినగా, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. చివరకు ఆ ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. ఈ క్రమంలో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. శరత్ బాబు మృతి నేపథ్యంలో ఆయన సన్నిహితులు, బంధువులు శరత్ బాబు ఆఖరి కోరిక గురించి చర్చించుకుంటున్నారు. పాపం చివరి కోరిక తీరకుండానే మృతి చెందాడు అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ఆ చివరి కోరిక ఏంటి అంటే.. శరత్ బాబుకు హార్సిలీ హిల్స్ ప్రాంతం అంటే బాగా ఇష్టమట. హార్సిలీ హిల్స్‌లో స్థిరపడాలనేది శరత్‌బాబు కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్ను మూశారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో శరత్‌బాబు చేసిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’ (2023). ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన ‘మళ్ళీ పెళ్లి’లో శరత్‌బాబు కీలక పాత్ర చేశారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి సినిమా. శరత్ బాబు మృతిపై ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.