ఇటీవల ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. శ్రీనివాసమూర్తి మరణవార్తతో డబ్బింగ్ ఇండస్ట్రీకి, అసోసియేషన్ లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు మూర్తి ఆకస్మిక మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తూ మూర్తి లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ సినిమాలకు పెద్ద లాస్ అని పేర్కొన్నారు. ఆయితే.. ముందుగా అందిన సమాచారం ప్రకారం.. అందరూ మూర్తి గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు.
మూర్తి చనిపోయింది గుండెపోటుతో కాదని.. అసలు విషయాన్ని చెబుతూ షాకిచ్చారు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవిశంకర్. ఆయన మాట్లాడుతూ.. “మూర్తి మరణం గురించి అందరు హార్ట్ ఎటాక్ అని మాట్లాడుకుంటుంటే.. వార్తలలో చూసి విన్నాను. కానీ.. అసలు జరిగింది అది కాదు. మార్నింగ్ పూజ చేసే టైంలో పూలు తెంపడానికి వెళ్లి రెండో అంతస్తు నుండి పడ్డాడని ఫ్యామిలీ చెప్పారు. మరి పైనుండి కాలు స్లిప్ అయి పడ్డాడా? లేక ఆ టైంలో ఏదైనా స్ట్రోక్ వచ్చి పడిపోయాడా తెలియదు. బట్.. పైనుండి నేరుగా రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. తనకు రోజూ పూజచేసి వర్క్ కి వెళ్లే అలవాటు ఉందని అన్నారు.
రవిశంకర్ ఇంకా మాట్లాడుతూ.. “మూర్తికి దైవభక్తి ఎక్కువ. ఎప్పుడైనా సరే దేవుడికి పూజ చేశాకే బయటకి వెళ్తాడు. ఎప్పటిలాగే పొద్దున్నే ఇంటి బయట గేట్ దగ్గర డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడట. ఆ టైంలో మరి రెండో అంతస్తులో పూలు కోయడానికి వెళ్లి.. అక్కడి నుండి స్లిప్ అయి పడిపోయాడని.. పడిన వెంటనే తలకు పెద్ద గాయం తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఏదేమైనా ఇలా మూర్తి చనిపోవడం అనేది బాధాకరమైన దురదృష్టకరం. చాలా బాధాకరమైన విషయం.” అని అన్నారు. మూర్తి ఎక్కువగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.