Raj Kiran: పందెం కోడి సినిమాతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ తమిళ నటుడు ‘రాజ్ కిరణ్’. తమిళ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగు తెరపై కనిపిస్తూవస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కిరణ్ కుటుంబ కలహాలతో సతమతం అవుతున్నారు. పెంపుడు కూతురు కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దత్తత తీసుకుని పెంచుకున్న ప్రియ అనే కూతురు ఓ సీరియల్ నటుడ్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి రాజ్ కిరణ్‌కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. రాజ్ కిరణ్ ఫేస్‌బుక్‌లో.. ‘‘ నాకు ప్రియ అనే ఓ పెంపుడు కూతురు ఉంది. ఆమెది హిందూ మతం. నేను ఆమెను దత్తత తీసుకున్న తర్వాత ఎప్పుడు నా పెంపుడు కూతురిలా ఎవ్వరికీ పరిచయం చేయలేదు. అందరికీ నా సొంత కూతురనే పరిచయం చేశాను. ఆ సీరియల్ నటుడు ఫేస్‌బుక్‌లో ఆమెకు పరిచయం అయ్యాడు.
బాగా బ్రెయిన్ వాష్ చేశాడు. ప్రియ అతడ్ని పెళ్లి చేసుకుంటాననేలా చేసుకున్నాడు. నాకు ఈ విషయం తెలిసినపుడు అతడి గురించి ఎంక్వైరీ చేశాను. అతడో చెత్త మనిషని, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడని తెలిసింది. అతడి ఉద్ధేశ్యం ఆమెను పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపటం కాదు. నా ద్వారా సినిమాల్లో అవకాశాలు పొందటానికి, నా నుంచి డబ్బులు గుంజటానికి చూస్తున్నాడు. నేనిదంతా నా పెంపుడు కూతురికి చెప్పాను. నేను చెప్పింది తను వినలేదు. ఇకపై తనను తాను నా కూతురికా చెప్పుకోదల్చుకోలేదని అంది. నా మాటకు విరుద్ధంగా అతడ్ని పెళ్లి చేసుకోవద్దని నా భార్య ప్రియను బ్రతిమాలింది. అతడ్ని వదిలేయమని చెప్పింది.
అప్పుడు ప్రియ సరేనంది. కానీ, తర్వాత ఆంధ్రాలో ఉన్న నా భార్య స్నేహితురాలు లక్ష్మీ పార్వతి దగ్గరకు వెళ్లి నాలుగు నెలలు ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పుడంతా నా పరువుకు భంగం కలిగే పనులు జరుగుతున్నాయి. ఆమె నా భార్యను తప్పుబడుతోంది. కేవలం నా భార్య మాత్రమే తనకు మొదటి నుంచి సపోర్టుగా నిలిచింది. నాకు కోపం వచ్చినపుడు తనే నచ్చచెప్పేది. నా కూతురు ఓ మంచి వ్యక్తిని ఎంచుకుని ఉంటే.. నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని. కానీ, ఆమె డబ్బుకోసం ఎదైనా చేసే వ్యక్తిని ఎంచుకుంది. ఈ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. ఆ ఇద్దరితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకు నాకుటుంబానికి కూడా ఎటువంటి సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : Regina Cassandra Marriage: లవ్-బ్రేకప్-పెళ్లి గురించి హీరోయిన్ రెజీనా క్లారిటీ