పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం యూనివర్సిటీ. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇటీవలే తెలంగాణలో పేపర్ల లీకేజ్ కలకలం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తొలుత టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలతో ప్రారంభమైన లీకేజీల పర్వం.. చివరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా జరిగింది. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ లీకేజ్ ఘటనలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇక తాజాగా ఈ పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రధానంగా చేసుకుని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో జరిగే నేరాల, ఘోరాలు, అన్యాయాలను ఆధారంగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ “యూనివర్సిటీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ” స్నేహ చిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న “యూనివర్సిటీ” చిత్రం సెన్సార్ పూర్తి అయింది.
అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము. 10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1,2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీ కేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ ‘యూనివర్సిటీ’ ” అని ఆయన తెలిపారు.
పాటలను ప్రముఖ గాయకులు గద్దర్ పాడారు. అంతేకాక సాయిచరణ్, గోస్కుల రమేష్, పల్లె నరసింహం కూడా ఈ చిత్రంలో పాటలు పాడారు. ఈ సినిమాకు మాలిక్ ఎడిటర్ గా పనిచేశారు. బాబూరావు దాస్ కెమెరా వర్క్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆర్. నారాయణ మూర్తి ఉన్నారు. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఆర్ నారాయణ మూర్తి కొత్త చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.