వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో ప్రియాంత్ జైలలులో ఊచలు లెక్కపెడుతున్నారు. అయితే అతడికి జైలులో దోమలు బెడద ఎక్కువుగా ఉంటోందట. ఈ క్రమంలో సదరు నటుడి భార్య పోలీసులను వింతకోరిక కోరింది. ‘సార్.. మీ జైలులో దోమలున్నాయంట. అందుకని క్యారవాన్ తీసుకొచ్చాను.. మా ఆయనను అందులో ఉంచండి..’ అంటూ రిక్వెస్ట్ చేసింది.
‘సార్.. మా ఆయన సినిమా హీరో. మీరు ఇలా ట్రీట్ చేయడం కరెక్టేనా. లాకప్ లో దోమలు, వేడితో చాలా ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్ లో ఉంచడానికి అనుమతివ్వండి..’ అంటూ నటుడి భార్య పోలీసులను వింత కోరిక కోరింది. చట్టం అందుకు ఒప్పుకోదని పోలీసులు చెప్పగా.. క్యారవాన్ పోలీస్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని ఎదురు ప్రశ్నించింది. రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా.. ‘కనీసం గంటపాటు అయినా నా భర్తను క్యారవాన్ లో ఉంచండి..’ అంటూ బతిమిలాడింది. రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన ఓ భర్త కోసం.. భార్య ఇలాంటి కోరిక కోరడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.
పోలీసులు చెప్పిన దాన్ని బట్టి.. “కొత్తగా మా ప్రయాణం” సినిమా హిరో ప్రియాంత్ రావుకు ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రెండు నెలలకు ఆమెకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలో ఒక రోజు పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నగర శివారులోని ప్రగతి రిసార్టుకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న తన కార్యాలయానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించింది. చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో నిందితుడు మొహం చాటేసినట్లు ఆమె పేర్కొంది. అబార్షన్ కోసం మెడిసెన్స్ ఇవ్వడంతో అనారోగ్యం పాలయ్యానని.. అంతేకాకుండా ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు జూలై 9న పోలీసులకు పిర్యాదు చేసింది.