ప్రకాశ్ రాజ్.. నటనలో అత్యున్నత శిఖరం ఆయన. మనిషిగా గొప్ప మానవతావాది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. తనపైన రాళ్ళూ పడ్డాయి. పూల వర్షం కురిసింది. విమర్శించిన వారు ఉన్నారు. మా ప్రకాశ్ రాజ్ అంటూ నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతారు. కానీ.., ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మూడో కంటికి తెలియకుండా సహాయం చేసేస్తారు. అలాంటి ప్రకాశ్ రాజ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.
భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇష్టపడటం ప్రకాశ్ రాజ్ స్టయిల్. నిజానికి ఆయన తల్లిదండ్రులు కూడా.. వేరు వేరు కులాలకి , ప్రాంతాలకి, మతాలకి చెందిన వారు కావడం విశేషం. ప్రకాశ్ రాజ్ తల్లి ఓ క్రిష్టియన్. ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగింది. అంతకు మించి.. ఆమెకి ఓ కుటుంబం అంటూ లేదు. అలా అనాధగానే ఆమె నర్సింగ్ విద్యని పూర్తి చేసి.., బెంగుళూరు మహా నగరంలోని ఓ హాస్పిటల్ లో నర్స్ గా జాయిన్ అయ్యింది.
మరోవైపు ప్రకాశ్ రాజ్ తండ్రిది వేరే నేపధ్యం. ప్రకాశ్ రాజ్ తాతల కాలం నుండి వారిది వ్యవసాయ కుటుంబం. కానీ.., ప్రకాశ్ రాజ్ తండ్రి ఊరిలో వ్యవసాయాన్ని చేయడానికి ఇష్టపడలేదు. దీంతో.., మంగుళూరు నుండి బెంగుళూరుకి పారిపోయి వచ్చేశాడు. కానీ.., ఆయన అనుకోకుండా ఓసారి అనారోగ్యం పాలు కావడంతో ఆస్పతిలో జాయిన్ అయ్యాడు. అక్కడ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకున్నారు. అలా.. 1965 మార్చి 26న బెంగుళూర్ లో ప్రకాశ్ రాజ్ జన్మించాడు.
సెయింట్ జోసఫ్ హై స్కూల్ లో ప్రకాశ్ రాజ్ విద్యాభాసం పూర్తి అయ్యింది. ఆ తరువాత అక్కడే కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ.., ఈ చదువు, డిగ్రీలు అంతా ఇంట్లో వారి కోసమే. చిన్నప్పటి నుండి ప్రకాశ్ రాజ్ కి నాటకాలంటే పిచ్చి. సినిమాలంటే ప్రాణం. పెద్దయ్యాక తాను కూడా వెండితెరపై వెలిగిపోవాలని ప్రతిరోజు కలలు కనేవాడు. ఇందుకు తగ్గట్టే నాటకాలలో కూడా రాణించాడు. కానీ.. విచిత్రం ఏమిటో తెలుసా? నటన కోసం ప్రకాశ్ రాజ్ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు.
ఇక డిగ్రీ పూర్తి అయ్యాక ప్రకాశ్ ఇండస్ట్రీలో అవకాశాల వేట మొదలుపెట్టాడు. కానీ.., వెళ్లిన ప్రతి చోటా నిరాశే. ఆ సమయంలో ఖర్చుల కోసం నాటకాల్లో స్టేజ్ షోస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒక్కో ప్రదర్శనకి రూ.300 జీతం. అలా తాను కనీసం 2000 స్ట్రీట్ షోలో నటించాడ. ఇలా వచ్చిన అనుభవం, పేరు ప్రకాశ్ రాజ్ కి దూరదర్శన్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో అవకాశం కల్పించింది. అక్కడ కూడా ప్రకాశ్ సూపర్ హిట్. దీంతో.., తక్కువ సమయంలోనే ప్రకాశ్ రాజ్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. కాకుంటే అన్నిట్లో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలే.
రామాచారి, రణధీర, నిష్కర్ష, లాకప్ డెత్ వంటి సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కి మంచి పాత్రలు దొరికాయి. ప్రకాశ్ రాజ్ డైలాగ్ డెలివరీ, వాయిస్ కాస్త స్పెషల్ గా ఉండటంతో ఇండస్ట్రీ అతన్ని త్వరగా గుర్తించింది. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ సినిమాలో కూడా ప్రకాశ్ రాజ్ కి అవకాశం లభించించి. ఆ సినిమా సెట్స్ లో ప్రకాశ్ రాజ్ నటన చూసిన హీరోయిన్ గీత ప్రకాశ్ రాజ్ ని తన గురువు కె. బాలచందర్ కి పరిచయం చేసింది.
మాములుగా కె.బాలచందర్ కి నటుల నటన ఒక్క పట్టాన నచ్చదు. ఆయన గుడ్ అన్నారు అంటే అది ఆస్కార్ స్థాయి నటన అని అర్ధం. కానీ.., ప్రకాశ్ రాజ్ నటన కె. బాలచందర్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వెంటనే అతనితో డ్యుయెట్ మూవీని తెరకెక్కించాడు. ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత మణిరత్నం ఇద్దరు మూవీ అఫర్ ప్రకాశ్ రాజ్ ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటవిశ్వరూపాన్ని చూపించేశాడు. ఫలితంగా యావత్ సౌత్ సినీ లోకం ప్రకాశ్ నటనకి దాసోహం అంది. అక్కడి నుండి ప్రకాశ్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ముఖ్యంగా తెలుగులో ఈ విలక్షణ నటుడి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
” అంతఃపురం, హిట్లర్, చిరునవ్వుతో, సుస్వాగతం, చూడాలని ఉంది, బద్రి, ఒక్కడు” వంటి సినిమాలలో ఆయన ప్రతికథానాయకుడిగా సూపర్భ్ అనిపించుకున్నాడు. ఇక “నువ్వే నువ్వే” సినిమాలో తండ్రి పాత్రకి ప్రాణం పోసేశాడు. అక్కడి నుండి ప్రకాశ్ రాజ్ కి తండ్రి పాత్రలు క్యూ కట్టాయి. ఇదే సమయంలో “ఖడ్గం” మూవీలో హీరోగాను సత్తా చాటాడు. ఇలా పాత్ర ఏదైనా, ప్రకాశ్ రాజ్ మాత్రం నటుడిగా అమాంతం ఎదిగిపోతూ వచ్చాడు.
ఒకానొక సమయంలో ప్రకాశ్ రాజ్ పై బ్యాన్ విధిస్తే.., తిరిగి 6 నెలల్లోనే ఆయన్ని తీసుకోకతప్పని పరిస్థితి ఇండస్ట్రీకి ఏర్పడింది. ప్రకాశ్ రాజ్ లేకుండా స్టార్ హీరోలు ఎవ్వరూ సినిమా చేయలేని స్థితి వచ్చేసింది. ఓ ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగయ్య, కోటా, సత్యనారాయణ తరువాత ఇంతలా తెలుగులో ప్రభావం చూపిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ మాత్రమే. ఇదంతా కేవలం తెలుగునాట మాత్రమే. ఇన్నే విజయాలను ప్రకాశ్ రాజ్ మొత్తం 6 భాషల్లో అందుకోవడం విశేషం.
రీల్ లైఫ్ లో తిరుగు లేని ప్రస్థానం ప్రకాశ్ రాజ్ ది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆయనకి ఒడిదొడుకులు తప్పలేదు. ప్రకాశ్ రాజ్ 1994లో లలితా కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. వీరికి మేఘన, పూజా, సిద్దు అనే ముగ్గురు పిల్లలు. కానీ.., 2004 లో ప్రకాశ్ రాజ్ తన కొడుకుని కోల్పోయాడు. ఆ తరువాత తన వివాహ బంధానికి బీటలు వారాయి. ఇన్ని ఆటుపోట్ల తరువాత ప్రకాశ్ రాజ్ బాలీవుడ్ కు చెందిన నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో మరో వివాహము చేసుకున్నాడు. వీరికి 2015 లో వేదాంత్ అనే ఓ కొడుకు జన్మించాడు.
నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెస్ట్ అనే ధోరణి ప్రకాశ్ రాజ్ ది. ఇందుకే తన సంపాదనలో ఎక్కువ భాగం ఆయన సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో కూడా పోటీ చేశారు ప్రకాశ్ రాజ్. బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నుండి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కానీ.., విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా..,
ఈ నాటికీ దేశంలో జరిగే ప్రతి తప్పుపై ప్రకాశ్ రాజ్ తన గొంతుకని వినిపిస్తూనే ఉంటాడు. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటాడు. మొత్తంగా ఓ నటుడిగా మాత్రమే కాకుండా.., కంప్లీట్ మేన్ గా ప్రకాశ్ రాజ్ మంచి పేరుని దక్కించుకున్నాడు. ఐదు ఫిల్మ్‌ఫేర్ లు, ఆరు నందులు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు ప్రకాశ్ రాజ్ ని వరించాయి. ఇంత సాధించినా.., ఆయన ఇంకా సినిమానే ప్రాణంగా భావిస్తూ.., ముందుకి వెళ్తుండటం విశేషం.