కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు.
షూటింగ్ కు రాకపోవడం వల్ల దర్శకనిర్మాతలు, కో యాక్టర్లకు అసౌకర్యం కలుగుతున్నందుకు చింతిస్తున్నా. దేవుడి దయ, ప్రజల ప్రేమాభిమానాలతో తాను త్వరగా కోవిడ్ నుంచి రికవరీ అయ్యి తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతానని పోసాని కృష్ణమురళి ఆశాభావం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్ రావడంతో ఇండస్ట్రీ షాకైంది.
కుటుంబసభ్యులతోపాటు ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆయన ఫాలోవర్లు, ఇండస్ట్రీ వర్గాలవారు కోరుకుంటున్నారు.