అలీ, నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా అక్టోబర్ 28న విడుదల అయ్యింది. ఏ విషయాన్ని అయినా ఫోటోనో, వీడియోనో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయాలన్న ఆతురత కలిగిన అలీ వల్ల, మాటలు రానటువంటి సాధారణ ప్రభుత్వ ఉద్యోగి, అతని కుటుంబం ఎదుర్కున్న సమస్యలు ఏమిటి? ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. మలయాళ ‘వికృతి’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ జంట పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా దివ్యాంగుడిగా నరేష్ అద్భుతంగా నటించారు. నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ సందర్భంగా నరేష్, పవిత్ర లోకేష్ పండగ చేసుకుంటున్నారు. తమ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మీడియా ముందుకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా ఇంతటి విజయాన్ని సాధించినందుకు టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నామని.. రివ్యూలు కూడా చాలా వరకూ పాజిటివ్ గానే వస్తున్నాయని నరేష్ అన్నారు. నిన్న రాత్రి నుంచి సినిమా బాగుందని తనకు మెసేజ్ లు పంపుతున్నారని నరేష్ అన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి తమ సినిమా నిరూపించిందని అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంటూ నరేష్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పవిత్ర మాట్లాడుతూ.. ఈ సినిమాని అందరూ చూడాలని, నిర్మాత అలీని, నటుడు నరేష్ ని ఎంకరేజ్ చేయాలని కోరారు.