Bomma Blockbuster: తెలుగు బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ రష్మీ. ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ ఛానల్ ఈ ఛానల్ అని లేకుండా అన్ని ఛానల్స్‌లో షోలు చేస్తున్నారు. షోలతో బిజీబిజీగా గడుపుతున్న ఆమె అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా, ఆమె నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మీ, నందు సరసన హీరోయిన్‌గా నటించారు. సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర హీరో నందు రష్మీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తాజాగా, నందు యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో నందు మాట్లాడుతూ.. ‘‘ నేను యూట్యూబ్‌కు వచ్చి మీ అందరితో మాట్లాడటానికి కారణం యాంకర్ రష్మీ. ఆమె వల్ల మేము సమస్యల్ని ఎదుర్కొంటున్నాము. రష్మీ మా సినిమా ప్రమోషన్లకు రావట్లేదు. నా ఫోన్ ఎత్తట్లేదు. పది నిమిషాలు ఎకధాటిగా కాల్ చేసినా తను ఫోన్ ఎత్తదు. రష్మీ ఇక్కడే షూటింగ్ చేస్తోందని తెలిసింది. రష్మీని బ్యాడ్ చేసే ప్రయత్నం అయితే కాదు. ఆమె మాకు సపోర్ట్ చేయటం లేదు. రష్మీది తప్పయితే ఆమెకు తెలియజేద్దాం. తన ప్రాబ్లమ్స్ తనకు ఉంటాయి. తను ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదు అని కనుక్కోవటానికి వచ్చాం.
మేము ఆమెను తప్పు బట్టట్లేదు. రష్మీ మేకప్ మ్యాన్ కూడా ఫోన్ ఎత్తట్లేదు’’ అని అన్నాడు. నందు, కిరిటీ మరో వ్యక్తి కలిసి రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లాట్‌లోకి వెళ్లారు. అక్కడ రష్మీని ఈ విషయమై నిలదీశారు. దీంతో రష్మీ ‘‘ మీరు నన్ను వేధిస్తున్నారా?.. నాకు వేరే షూట్ ఉంది’’ అని ఆమె అంది. తర్వాత కొద్దిసేపు ఇద్దరూ వాదించుకున్నారు. ఆ వెంటనే రష్మీ‘‘ నేను మీ సినిమా ప్రమోట్ చేయను’’ అని తేల్చి చెప్పింది. అయినా వాళ్లు వినలేదు. ఆమెను ఒప్పించారు. తర్వాత ఆమె ప్రమోషన్‌లో పాల్గొంది. సినిమా 2 సంవత్సరాల తర్వాత రిలీజవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.