డ్రగ్స్ కేసుకు సంబంధించిన మీడియా తన ఫోటోలు పెట్టి వార్తలు రాయటంపై నటి జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిర్మాత కేపీ చౌదరితో పలువురు టాలీవుడ్ ప్రముఖులకు సన్నిహిత సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేపీ చౌదరి ఫోన్‌లోని కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిలో నటి జ్యోతి పేరు కూడా ఉంది. దీంతో జ్యోతిపై పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలపై జ్యోతి తాజాగా స్పందించారు. తన ఫోటో పెట్టి వార్తలు రాయటాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో.. ‘‘ నేను షూట్‌లో ఉంటే చాలా వింటున్నాను. చాలా కాల్స్ వస్తున్నాయి. నా ఫ్యామిలీనుంచి.. ఫ్రెండ్స్‌నుంచి మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. ఏంటి మీ ఫొటోలు అన్ని మీడియాల్లో వస్తున్నాయి అంటున్నారు. నేను అందరికీ చెబుతున్నాను. నాకు అందులో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. మీరు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయండి. క్రిమినల్స్‌కు కూడా ముసుగులు తొడుగుతారు. అసలు కేసులో ఉన్నానా లేనా అని నిర్ధారించకుండా లేడీ ఫొటో ఎలా వేస్తారు?
కేపీ అనే వ్యక్తి ఏం చెప్పాడో తెలుసుకోకుండా మీరు ఫొటోస్ వేయటం చాలా తప్పు. అది చాలా బాధిస్తుంది. నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే ఒప్పుకుంటా. నాకు అతడికి జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. కేపీ హైదరాబాద్ వస్తే.. ఆయన వాళ్ల అబ్బాయిని మా ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవారు. నేను వాళ్ల అబ్బాయిని చూసుకుంటూ ఉంటాను. మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. నాకు ఆయనతో ఫ్యామిలీ బాండింగ్ ఉంది. కానీ, డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నేను నా ఫోన్‌లోని ఏ కాల్ లిస్ట్ డిలీట్ చేయలేదు. పోలీసులు వచ్చినా ఎదుర్కోవటానికి నేను రెడీగా ఉన్నా. అమ్మాయిల మీద తప్పుడు ఆరోపణలు’’ అని అన్నారు.