గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గత వారంలో టాలీవుడ్ కి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ మదన్, పంజాబ్ స్టార్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా, బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్, మాలీవుడ్ కి చెందిన బి హరికుమార్, ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. ఈ విషాదాలు మరువక ముందే హాలీవుడ్ నటుడు, పవర్ రేంజర్ ఫేమ్ జాసన్ డేవివ్ ఫ్రాంక్ కన్నుమూశాడు.
పిల్లలకు ఎంతో ఇష్టమైన పవర్ రేంజర్ సీరీస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికీ పిల్లలు టీవీల్లో పవర్ రేంజర్ షోస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. అందులో నటీనటులను అనుకరిస్తుంటారు. ‘మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్’ షో లో నటించిన ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ అమెరికాలోని టెక్సాక్స్ లో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. జాసన్ డేవిడ్ ఫ్రాంక్ నటించిన టమీ ఓలీవర్ పాత్రకు ఎంతో ప్రజాధరణ లభించింది. అలాంటి డేవిడ్ ఆత్మహత్య చేసుకొని మరణించారన్న వార్త తెలిసి ఫ్యాన్స్ ఒక్కసారే షాక్ కి గురయ్యారు.
పవర్ రేంజర్ లో షో లో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మొదట గ్రీన్ రేంజర్ తో పాపులారిటీ సంపాదించిన తర్వాత వైట్ రేంజర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా బయటకు తెలియరాలేదు. 90వ దశకంలో పవర్ రేంజర్ సీరీస్ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. గ్రీన్ రేంజర్ గా నటిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్న తమ అభిమాన నటుడు జాసన్ డేవిడ్ ఫ్రాంక్ కి సంబంధించిన మరణ వార్త ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.