అతడు ఓ నటి ఇంట్లో పనివాడు. వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి మరీ ఆమె దగ్గర కొన్నేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలాంటి అతడికి లాటరీలో సూపర్ జాక్ పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
లాటరీ.. ఈ పేరు వినగానే చాలామంది తెగ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే అదృష్టం తమని ఎప్పుడూ వరిస్తుందో అని కొందరు లాటరీ టికెట్స్ తెగ కొనేస్తుంటారు. అలా కొన్నిసార్లు అనుకోని రీతిలో ఒక్క దెబ్బకు కోటీశ్వరులు అయిపోతుంటారు. తాజాగా ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి అలాంటి జాక్ పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా రూ.10 కోట్లు గెలిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నాడు. అతడు మాత్రమే కాదు ఇన్నేళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని అదృష్టం వరించేసరికి సదరు నటి కూడా తెగ ఆనందపడిపోతోంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ గిట్టా కొచ్చిలో ఉంటున్నాడు. నటి రజిని చాందీ ఇంట్లో కొన్నేళ్ల నుంచి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతడికి లాటరీ టికెట్స్ కొనే అలవాటు ఉంది.. ఈ క్రమంలోనే రీసెంట్ గా కేరళ ప్రభుత్వం సమ్మర్ బంపర్ లాటరీ టికెట్స్ ని అమ్మింది. వీటిలో భాగంగా ఓ టికెట్ ని ఆల్బర్ట్ కొనుగోలు చేశాడు. దాని నంబర్ SE222282. తాజాగా లాటరీ తీయగా ఈ టికెట్ నే అదృష్టం వరించింది. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకున్నట్లు ఆర్గనైజర్స్ ప్రకటించారు. దీంతో ఆల్బర్ట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కేవలం రూ.250 పెట్టి టికెట్ కొంటే రూ.10 కోట్ల లాటరీ తగలడాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు.
రూ.10 కోట్ల లాటరీలో ట్యాక్సులన్నీ పోగా రూ.6.5 కోట్లు ఆల్బర్ట్ కు వచ్చాయి. అందుకు సంబంధించిన చెక్ ను ప్రభుత్వ అధికారులు ఇతడికి అందజేశారు. నటి రజిని చాందీ కూడా ఈ విషయమై సంతోషం వ్యక్తం చేసింది. ‘ఆల్బర్ట్ నా ఇంట్లో చాలారోజుల నుంచి పనిచేస్తున్నాడు. నిర్వహకులు అతడికి లాటరీ తగిలిందని నిన్ననే శుభవార్త చెప్పారు.’ అని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఈ లాటరీకి ముందురోజు.. ఎర్నాకులంలోని మరో పనివాడిని అదృష్టం వరించింది. రూ.75 లక్షలు గెలుచుకున్నాడు. ఇలా వలస కోసం కేరళ వచ్చిన వర్కర్స్ వరసగా లక్షలు, కోట్లు లాటరీ గెలుచుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.