ఈ మద్య కాలంలో చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. బాలీవుడ్ లో వరుస గా బుల్లితెర నటీనటులు కన్నుమూశారు.
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. బెస్ట్ యాక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోవడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఈ నెలలోనే టాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఇక బాలీవుడ్ లో అయితే వరుసగా బుల్లితెర నటీనటులు ఆదిత్య సింగ్ రాజ్ పూత్, వైభవి ఉపాధ్యాయ, నితీష్ పాండే ఇలా వరుసగా చనిపోయారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మాలీవుడ్ నటుడు హరీష్ పెంగన్ (49) కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
మళియాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు హరీష్ పెంగన్, వయసు 49 సంవత్సరాలు.. కాలేయ సమస్యతో మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల హరీష్ కి తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది.. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల మొదటి వారం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి అవసరం అని తెలిపారు. పెంగన్ సోదరి అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చినా శస్త్ర చికిత్సకు అవసరమైన రూ.30 లక్షలు సమకూర్చలేకపోయారు.
మరోవైపు నటుడి స్నేహితులు నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుండగానే పెంగన్ ఆరోగ్య పరిస్థితి విషమించి మధ్యాహ్నం 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ పెంగన్ జయ జయ జయ జయ హే, హనీ బి2.5, మహెషింటే ప్రతీకారం, జో అండ్ జో, మిన్నల్ మురళి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడి అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.