నిత్యానంద.. ఒకప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక నటి రంజితతో నిత్యానంద రిలేషన్ గురించి బోలేడు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా రంజిత తండ్రి అశోక్.. కుమార్తె, నిత్యానంద బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది సుమన్ టీవీ. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు అశోక్ కుమార్. సుమారు 25కు పైగా చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. ఆ తర్వాత సడెన్‌గా సినిమాల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీ.. అశోక్ కుమార్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లి, పిల్లలు, నిత్యానంద వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. ఇలా అన్ని విషాయాల గురించి వివరించారు అశోక్. నిత్యానంద పేరు వినగానే జనాలకు టక్కున గుర్తుకు వచ్చే మరో పేరు రంజిత. తెలుగులో మావి చిగురు, శ్రీరాములయ్య చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన రంజిత. తక్కువ సినిమాల్లోనే యాక్ట్ చేసినప్పటికి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఏం జరిగిందో తెలియదు.. కానీ రంజిత, నిత్యానందకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ ప్రపంచానికి వెల్లడించాయి. ఇక తాజా ఇంటర్వ్యూలో అశోక్ దీనిపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు ముగ్గురు కుమార్తెలు అని చెప్పారు అశోక్. ‘‘అందరిని పెద్ద చదువులు చదివించాను. వీరిలో రంజిత రెండో అమ్మాయి. ఆమెకు సినిమాలంటే ఆసక్తి లేకపోయినా.. చిత్రాల్లో నటించింది. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంది. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఓ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో జరిగిన మిస్టేక్ వల్ల.. తనకు ఇక భవిష్యత్తులో కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు వైద్యులు. అయితే ఆ తర్వాత రంజిత, ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. నా మొదటి కుమార్తెకి విజయవాడ గన్నవరం దగ్గర ఉన్న మేనల్లుడితో పెళ్లి చేశాను. వారు అమెరికా వెళ్లినప్పుడు నిత్యానంద ప్రవచనాలకు వెళ్లేది. అలా ఆమెకు నిత్యానందతో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా భర్తకు విడాకులు ఇచ్చి.. నిత్యానంద ఆశ్రమయంలో చేరింది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ఆ తర్వాత రంజిత కూడా నిత్యానంద ఆశ్రమంలో చేరింది. ఆ తర్వాత రంజిత, నిత్యానంద గురించి పేపర్లు, టీవీల్లో రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాక రంజిత, నిత్యానంద పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశారు. అయితే వాటిల్లో నిజమెంత ఉందో నాకు తెలియదు. కానీ నా ఇద్దరు బిడ్డలు విడాకులు తీసుకోవడం వెనక నిత్యానంద ప్రమేయం ఉందని కచ్చితంగా చెప్పగలను. వారిద్దరూ.. ఇండియాలో నిత్యానంద ఆశ్రమంలో ఉండగా.. అక్కడి నుంచి తీసుకురావడానికి, నేను భార్య వెళ్లాం. కానీ అమ్మాయిలిద్దరూ మాతో రావడానికి అంగీకరించలేదు. తమకు ఇక్కడే బాగుందని.. మోక్షం, భక్తి కారణంగా ఇక్కడే ఉంటాం అన్నారు’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘ఆశ్రమానికి వెళ్లినప్పుడు నిత్యానంద నా దగ్గరకు వచ్చి.. మీ అమ్మాయిలను చూసి గర్వపడుతున్నాను అన్నాడు. అతడి మాటలతో నాకు కోపం వచ్చింది. నేను మాత్రం గర్వ పడటం లేదు. ఇలా చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదారా అని ప్రశ్నించాను. నా కుమార్తెలను ఆశ్రమం నుంచి మాతో పాటు పంపించేయ్ అన్నాను. కానీ అతడు నా మాట వినలేదు. నా భార్యకు కోపం రాదు. అలాంటిది ఆ రోజు తను కూడా సీరియస్ అయ్యింది. బూతులు తిట్టింది. ఆ తర్వాత ఆ బెంగతో మంచం పట్టి మృతి చెందింది’’ అని చెప్పుకొచ్చారు. ఇద్దరు కుమార్తెలు తనతో మాట్లాడరని.. తాము బాగున్నాం అంటూ తన మూడో కుమార్తెకి మెసేజ్‌లు పెడతారని చెప్పుకొచ్చాడు. ఇద్దరు కుమార్తెల విషయం తప్ప.. నా జీవితంలో ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పుకొచ్చార అశోక్.