సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. తళతళ మెరిసే ఆ రంగుల వెనుక ఎన్నో చీకట్లు దాగి ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టామా.. ఇక సామాన్యుల మాదిరి సాధారణ జీవితం గడపడం అంత తేలికైన విషయం కాదు. సినిమాల్లో లభించే క్రేజ్, గుర్తింపుకు వారు బానిసలవుతారు. నిరంతరం ప్రేక్షకులకు కనిపించాలని ఆరాటపడతారు. తాము బయటకు వెళ్తే తమ చుట్టూ నలుగురు చేరాలని.. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలంటూ హడావుడి చేయాలని కోరుకుంటారు. అయితే సినిమా రంగంలో నిరంతరం తెర మీద కనిపించడం అంటే మాటలు కాదు. ప్రతి నటుడు తమ కెరీర్‌లో ఏదో ఒక దశలో.. అవకాశాల లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. స్టార్ హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితులు తప్పవు. ఇక చిన్నాచితక నటీనటుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సినిమా ఇండస్ట్రీలో నిత్యం అవకాశాలు లభిస్తున్నాయి అంటే వారికి టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా తోడున్నట్లే. అయితే అందరికి అలా అదృష్టం కలసి వస్తుందా అంటే లేదు.. నూటికి ఒక్కరికో ఇద్దరికో ఇలా లక్ కలిసి వస్తుంది. ఇక మిగతా వారు.. అవకాశాల కోసం ఎదురు చూసి చూసి.. ఇక ఇండస్ట్రీలో తమకు పని లభించదు అని తెలుకుని.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సామాన్య జీవితాన్ని గడుపుతారు. కానీ కొందరు మాత్రం.. అవకాశాలు లేకపోతే అల్లాడిపోతారు. తీవ్రమైన నిరాశనిస్పృహలకు లోనవుతారు. సినిమాలు తప్ప తమకు మరో జీవితం లేదని భావించి.. డిప్రెషన్‌కు గురై.. జీవితాన్ని అంతం చేసుకుంటారు. ఇప్పటికి ఇలాంటి సంఘటనలు అనేకం చూశాం.
మరీ నటీనటులకు సినిమాలే లోకమా.. అవకాశాలు లేకపోతేనో.. తగ్గిపోతేనో ఆత్మహత్యే శరణ్యమా.. ఇక తెర మీద కనిపించకపోతే జీవితమే ఉండదా.. అంటే కాదు అంటున్నాడు ఓ నటుడు. అవకాశాలు లేకపోతేనేం.. అంతకంటే అద్భుతమైన జీవితం తనకోసం ఎదురు చూస్తుందని తెలుసుకున్నాడు. సినిమాలే లోకం కాదు.. అది తన జీవితంలో ఓ భాగం మాత్రమే అని తెలుసుకున్నాడు. అవకాశం లభిస్తే సినిమాల్లో నటిస్తాను.. లేదంటే నా జీవితాన్ని నాకు నచ్చినట్లు ఆనందంగా ఆస్వాదిస్తూ బతుకుతాను అంటూ.. అసలు బతకడం అంటే ఎంటో చూపిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు నటుడు ఆషీశ్ విద్యార్థి. యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి.. జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ.. ఇది కదరా లైఫ్ అంటే అనిపించేలా ముందుకు సాగుతున్నాడు.
ఆశీష్ విద్యార్థి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. సినిమాల్లో భయంకరమైన విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టాడు. కేరళలో జన్మించిన ఆశీష్ విద్యార్థి ఢిల్లీలో పెరిగాడు. తొలుత బాలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. తెలుగులోనే పదుల కొద్ది చిత్రాల్లో నటించాడు. అయితే కొత్త నీరు వచ్చే కొద్ది పాత నీరు ప్రవహిస్తూ పోవాల్సిందే. పరిశ్రమలో కూడా అదే జరుగుతుంది. పాత వాళ్లు పోతుంటారు.. వారి స్థానంలో కొత్త వాళ్లు వస్తారు. ఈ క్రమంలో అవకాశాలు తగ్గుతాయి. అలాంటి సమయంలో నిరాశనిస్పృహలకు లోను కాకుండా.. ముందుకు సాగాలి.
ఆశీష్ విద్యార్థి కూడా అదే పని చేస్తున్నాడు. ఇన్నాళ్లు సినిమాల్లో చేస్తూ.. బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికింది. దాంతో జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే తన ప్రయాణాన్ని అందరికి తెలిసేలా చేస్తే.. కొందరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో.. యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన ఆశీష్ విద్యార్థి దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి వింతలు, విషేశాలు మరీ ముఖ్యంగా అక్కడి ఆహార పదార్థాల గురించి తెలియజేస్తూ వ్లాగ్స్ చేస్తున్నాడు. ఎంతో నాచురల్‌గా ఉండే ఈ వీడియోలు జనాలను ఆకర్షించాయి. రెండు సంవత్సరాల నుంచి ఆయన యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాడు. ఇక ఏడు నెలల క్రితం ఆశీష్ విద్యార్థి యాక్టర్ వ్లాగ్స్ చానెల్‌కి 12 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే.. ఆశీష్ వీడియోలు జనాలను ఎంత ఆకట్టుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అవకాశాలు తగ్గిపోయాయి కాద.. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆశీష్ విద్యార్థి నిరాశ చెందలేదు. నటులకి ముఖ్యంగా కావాల్సింది ఇదే. జీవితంలో ఎలాంటి సమయంలో కూడా నమ్మకాన్ని, ఆశను కోల్పోకూడదు. ఆశీష్ విద్యార్థి కూడా అదే చేశాడు. తనకు తానే ఓ పని.. అది కూడా మనసుకు నచ్చిన పని కల్పించుకుని.. జీవితాన్ని ఆస్వాదిస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ఆశీష్ విద్యార్థి జీవితం ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోని వారికి ఆదర్శం. సినిమా అవకాశాలు లేకపోతేనేం.. నీతి, నిజాయతీగా బతకడానికి భూమ్మీద బోలేడు అవకాశాలున్నాయి. కాకపోతే మనలోని ఇగోని పక్కకు పెడితే.. జీవితం కొత్త దారులు చూపుతుంది.
ఈ విషయం అర్థం చేసుకోలేకనే ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ వంటి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అర్థాంతరంగా తనువు చాలిస్తూ.. వారి సన్నిహితులనే కాక.. అభిమానులను కూడా ఏడిపిస్తున్నారు. అలాంటి వారికి ఆశీష్ విద్యార్థి జీవితం ఓ పాఠం.. స్ఫూర్తి. ఇక తాజాగా ఆశీష్ విద్యార్థి.. రైటర్ పద్మ భూషణ్ సినిమాలో మంచి పాత్రలో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు. అవకాశం వస్తే సినిమాలు చేస్తాను.. లేదంటే నా జీవితం నాకుంది అనుకుంటూ ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తోన్న ఆశీష్ విద్యార్థిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆశీష్ విద్యార్థి జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.