సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్.. తనపై వస్తోన్న తప్పుడు వార్తలను అడ్డుకోవడం కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరాధ్య బచ్చన్ విజయం సాధించింది. ఢిల్లీ హైకోర్టు బచ్చన్ వారసురాలికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధింఇచ నిరాధారమైన, తప్పుడు వార్తలను, వీడియోలను ప్రసారం చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన 9 యూట్యూబ్ ఛానెల్స్‌పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. చిన్నపిల్లల ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం అంటే వారికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది.
అంతేకాక ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది, ఇక లేవలేదు అంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు గూగుల్‌ను ఆదేశించింది. తన ఆరోగ్యంపై కొన్ని యూట్యూబ్ చానెల్స్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయంటూ ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు సరైనదేనని భావించిన జస్టిస్ సి.హరిశంకర్.. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం సహించదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు యూట్యూబ్ చానెల్స్‌పై నిషేధం విధించడమే కాక.. గూగుల్‌కి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న అప్‌లోడర్ల వివరాలను తక్షణమే పిటిషనర్లకు తెలియజేయాలని గూగుల్‌ను ఆదేశించారు. ఈ వీడియోలపై అప్‌లోడర్లు తగిన వివరణ ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వీడియోల గురించి గూగుల్ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చినా.. వాటిని తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. ఆరాధ్య పిటీషన్‌లో ప్రతివాదులుగా ఉన్న 9 యూట్యూబ్ ఛానెళ్లు.. ఫిర్యాదుదారు ఆరోగ్యానికి సంబంధించి, శారీరక స్థితి గురించి ఎలాంటి సమాచారాన్ని అయినా ప్రచారం చేయడం కానీ, షేర్ చేయడం కానీ, ఇంటర్నెట్‌లోని ఏ పబ్లిక్ ప్లాట్‌ఫాంలోనైనా వ్యాప్తి చేయడం నిషిద్ధమని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
10వ ప్రతివాదిగా ఉన్న గూగుల్ తక్షణమే పిటిషన్‌లో పేర్కొన్న వీడియోలన్నింటినీ తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, దీనికి 36 గంటల సమయం పడుతుందని గూగుల్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. యూట్యూబ్ ప్లాట్‌ఫాం మీద ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌పై వ్యవహరించే విధానానికి సంబంధించి గూగుల్ తన సవివరణ ప్రతిస్పందన తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.