బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. విభిన్న పాత్రలు పోషిస్తూ..నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి అలా ఉంచితే.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లిపై ఆలియా సిద్ధిఖీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. నవాజుద్దీన్ ఇంట్లో.. తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. కనీసం అన్నం కూడా పెట్టడం లేదని వాపోయింది. ఆ వివరాలు..
‘‘ఈ ఇంట్లో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. గది దాటి బయటకు రాకుండా బంధించారు. నేను రూమ్‌లోని సోఫానే బెడ్‌గా ఉపయోగించుకుంటున్నాను. నన్ను రూమ్ నుంచి బయటకు రాకుండా తలుపులు వేసేశారు. పోలీసులు కూడా స్టేట్‌మెంట్‌ను తీసుకోవటానికి రాలేదు. చివరకు నా లాయర్ ద్వారా స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. వీళ్లు నాకు అన్నం పెట్టడం లేదు.. కనీసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా.. ఫుడ్ తీసుకొచ్చే డెలివరీ ఏజెంట్స్‌ను కూడా ఇంట్లోకి రానివ్వటం లేదు. తినడానికి నన్ను వంట ఇంట్లోకి కూడా వెళ్లనివ్వడం లేదు. నాకు ఈ ఇంట్లో ఉండేందుకు హక్కు ఉంది. కానీ వీళ్లు మాత్రం నన్ను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు’’ అని ఆరోపించింది ఆలియా.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విడాకులు తీసుకోవాలని భావించారు. ఇక 2020లో నవాజుద్దీన్ సోదరుడు తనపై శారీరక హింసకు పాల్పడ్డారని ఆలియా ఆరోపణలు చేశారు. దాంతో ఈ జంట విడిపోతారని అందరూ భావించారు. కానీ 2021, కరోనా సమయంలో నవాజుద్దీన్ తనకు ఎంతో మేలు చేశాడని.. అండగా నిలిచాడని.. అందుకే విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది ఆలియా.
అయితే అదే సమయంలో అందేరిలోని తమ ఇంట్లో ఆలియా ఉండటానికి వీలులేదని నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవాజుద్దీన్ సైతం దీనిపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరి వీరి మధ్య వివాదాలు ఎప్పుడు ముగుస్తాయో తెలియడం లేదు. ఇక బాలీవుడ్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మెప్పించిన నవాజుద్దీన్ ప్రస్తుతం దక్షిణాదిపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాను ఓకే చేశారు. ఆయన నటిస్తోన్న తొలి తెలుగు చిత్రమిది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నవాజుద్దీన్ భార్య చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.