777 చార్లీ.. ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో రక్షిత్ శెట్టికి ఎంత పేరు, గుర్తింపు వచ్చిందో.. చార్లీ క్యారెక్టర్ చేసిన ఆ కుక్కకు కూడా అంతే పేరొచ్చింది. తన అమాయకత్వం, తెలివితేటలు, ధైర్య సాహసాలను చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులైపోయారు. అయితే అదంతా సినిమాలో కదా.. ట్రైనింగ్ ఇచ్చి అలా చేయించారు అనుకుంటున్నారు. అయితే అసలు ఆ జాతికి చెందిన కుక్కలు ఎలా ఉంటాయి? ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచితే ఎలా పెంచాలి? అంటూ ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో మెదిలిన అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.
చార్లీ సినిమాలోని డాగ్.. లాబ్రేడర్ రిట్రీవర్ జాతికి చెందింది. ఈ కుక్కలను ముద్దుగా లాబ్ అని కూడా అంటారు. ఇవి బ్రిటీషర్స్ కు చెందిన రిట్వీర్ గన్ డాగ్ జాతికి చెందినవి. రిట్రీవర్ అంటే ఏదైనా విసిరేస్తే తిరిగి తీసుకొచ్చేవి అనమాట. ఈ లాబ్రేడర్ జాతి రక్తంలోనే అది ఉంది.. అందుకే వాటిని లాబ్రేడర్ రిట్రీవర్ అంటారు. నిజానికి 1830ల కాలంలోనే ఈ జాతిని గుర్తించి అభివృద్ధి చేశారు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతం నుంచి యునైటెడ్ కింగ్ డమ్ కు ఇంపోర్ట్ చేసుకున్న ఫిషింగ్ డాగ్స్ నుంచి వీటిని అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పుడు కామన్ గా పెంచుకునే డాగ్ బ్రీడ్ ఇది.
ఈ లాబ్రేడర్ రిట్రీవర్ డాగ్ కేవలం ఇంట్లో ఆడుకునే పెంపుడు కుక్క మాత్రమే కాదు.. ట్రైన్ చేస్తే క్రీడలు, వేటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 1880ల్లో వీటిని ఎక్కువగా వేటకు ఉపయోగించేవారు. గన్స్ తో పిట్టలు, చిన్న చిన్న జంతువులను వేటాడితే.. పరుగున వెళ్లి వాటిని తెచ్చి ఇచ్చేవి. ఇవి ఎంతో తెలివైన డాగ్స్, అంతేకాకుండా లాయల్ గా ఉంటాయి. వీటికి నీళ్లు అంటే చాలా ఇష్టం. నీళ్లు, వర్షం చూసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వీటి పూర్వీకులను చేపల వేటకు ఉపయోగించేవారు. నీటిలో ఈదడం, నీళ్లతో ఆడుకోవడం అనేది వాటి రక్తంలోనే ఉంది.
ఈ లాబ్రేడర్ రిట్వీవర్లను వియత్నాం యుద్ధంలో వార్ డాగ్స్ గా కూడా ఉపయోగించారు. చనిపోయిన, గాయాలైన సైనికులను గుర్తించడం, శత్రువుల పొజిషన్ తెలుసుకునేందుకు వాడారు. వీటికి జ్ఞాపక శక్తికూడా చాలా ఎక్కువ.. ఒక వాసన చూస్తే ఎప్పటికీ మర్చిపోవు. వైద్యరంగంలో కూడా ఈ లాబ్రేడర్ బ్రీడ్ ను ఉపయోగిస్తున్నారు. ఎలాంటి పరీక్షలతో పనిలేకుండానే ఈ కుక్కలు మనిషిలోని క్యాన్సర్ ను గుర్తించగలవు. అది కూడా తొలి దశలోనే ఈ లాబ్రేడర్ బ్రీడ్ డాగ్ క్యాన్సర్ ను గుర్తించగలదు. అంతేకాకుండా మనిషిలోని డయాబెటిస్ వ్యాధిని కూడా ఈ కుక్కలు సమర్థంగా గుర్తించగలవు.
ఈ లాబ్రేడర్ డాగ్స్ 12 నుంచి 14 సంవత్సరాల వరకు జీవించగలవు. వీటికి బోర్ కొడితే ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటిని పాడు చేస్తాయి. వీటిని ట్రైన్ చేయకపోతే వాటి ప్రవర్తనతో చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ లాబ్రేడర్ రిట్రీవర్ బ్రీడ్ చాలా స్నేహపూర్వకంగా మెలిగే కుక్కలు. తెలియని వారితో కూడా చాలా సన్నిహితంగా మెలుగుతాయి. వీటిని ఇంట్లో పెంచుకోవాలనుకునే వారు వాటి వెంట్రుకలను క్లీన్ చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. కుక్కల జాతులు అన్నింటిలో లాబ్రేడర్ డాగ్స్ కు ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది.
ఈ లాబ్రేడర్ జాతి కుక్కలకు ఎంత తినాలో తెలియదు. పొట్ట నిండుగా ఉన్నా కూడా మీరు పెడుతూ ఉంటే అవి తింటూనే ఉంటాయి. మీ డాగ్ ఎంత తింటోంది.. ఎలా తింటోంది అనేది మీరే చూసుకోవాలి. రోజుకు కనీసం గంటపాటు లాబ్ తో వాకింగ్, రన్నింగ్, స్వమ్మింగ్ లాంటివి చేయించాలి. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి, లావు కూడా అయిపోతాయి. వాటికి సరైన శారీరక శ్రమ ఎంతైనా అవసరం. ఇవి మనుషులకు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. లాబ్రేడర్ డాగ్స్ మంచి స్ట్రెస్ బస్టర్స్.. వీటిని పెంచుకునే వారికి చాలా తక్కువ కోపం వస్తుంటుంది.
మార్కెట్ లో ఏది దొరికితే అది లాబ్రేడర్ అని కొనుక్కోకండి. ఈ డాగ్ బ్రీడ్ లో చాక్లెట్, బ్లాక్, ఎల్లో(క్రీమీ వైట్ నుండి ఫాక్సీ రెడ్ మాదిరిగా) మూడు రంగులు మాత్రమే ఉంటాయి. అసలైన లాబ్ అని తెలుసుకునేందుకు కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. వాటి రంగు, వాటి తోక కత్తిలా స్ట్రైట్ గా ఉంటుంది. తోక వంకరగా, వంగి ఉంది అంటే అది ఒరిజినల్ లాబ్రేడర్ బ్రీడ్ కాదని అర్థం. జర్మన్ షెపర్డ్ లా కాకుండా.. లాబ్రేడర్ చెవులు కిందకు వేలాడుతూ ఉంటాయి. వాటి తల కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ గుర్తులు ద్వారా అసలైన లాబ్రేడర్ డాగ్ బ్రీడ్ ను గుర్తించవచ్చు.
డాగ్ బ్రీడ్స్ లో లాబ్రేడర్ రిట్రీవర్ మంచి ఫ్రెండ్లీ, లాయల్, డేరింగ్ కాబట్టే.. డైరెక్టర్ ఈ బ్రీడ్ ని ఎంపిక చేశాడు. డైరెక్టర్ ఊహించిన విధంగానే.. రక్షిత్ శెట్టి- చార్లీ అనుబంధానికి ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమా పెట్ లవర్స్ కు ఎంతగానో నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, చార్లీలాంటి ఓ మంచి లాబ్రేడర్ రిట్రీవర్ ను మీరు కూడా పెంచుకోవాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.