ప్రభాస్ పేరు చెప్పుకుని రూ. 4 వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. టాలీవుడ్ లో అన్ని సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు ఐతే డార్లింగ్ సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు.
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలకు ప్రభాస్ భారీ పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా మొత్తం నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలతో దాదాపు రూ. 4 వేల కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. రూ. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే కనుక రూ. 800 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలానే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా రూ. 800 నుంచి రూ. 1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 500 కోట్లు.
పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకి రూ. 2 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి ఉంది. రూ. 200 నుంచి రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ. 500 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా నాలుగు సినిమాలతో ప్రభాస్ పేరు చెప్పుకుని రూ. 4 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ లో జరుగుతున్న బిజినెస్ లో సగం ప్రభాస్ పేరు మీద జరగడం గమనార్హం. నాలుగు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. టాలీవుడ్ లో అన్ని సినిమాలు వసూలు చేసే కలెక్షన్స్ లో సగం కలెక్షన్స్ ప్రభాస్ సినిమాల నుంచే వెళ్తాయి. మరి ప్రభాస్ పేరు మీద జరగబోతున్న భారీ బిజినెస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.