ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో లెజెండ్ అనే ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది. లెజెండ్ అనగానే మన బాలయ్య సినిమా రీమేక్ ఏమో అనుకోకండి. అది ‘ది లెజెండ్’ అని వేరే లెజెండ్. ఆ సినిమాకు మన బాలయ్యబాబు లెజెండ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమాకు లెజెండ్ అని పేరు పెట్టడానికి కారణమేంటి? ఎవరైనా బిగ్ స్టార్ హీరోగా నటిస్తున్నాడా? అంటే అదీ కాదు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవలే చెన్నైలో జరిగింది. నిజం చెప్తే షాక్ అవ్వుతారేమో.. ఈ ఆడియో ఫంక్షన్ కి సౌత్ నుండి నార్త్ వరకూ స్టార్స్ అనిపించుకున్న హీరోయిన్స్ 10 మంది హాజరయ్యారు.
మరి ఆ 10 మంది హీరోయిన్లు ‘ది లెజెండ్’ సినిమాలో భాగమా.. అంటే అదీకాదు. అసలు వచ్చిన హీరోయిన్లకు ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మరెలా వచ్చారు.. పెద్ద స్టార్ సినిమానా? అనుకుంటే.. అతని మొదటి సినిమా ఇది. కానీ.. ఈ సినిమాకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ నుండి అందరు టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో లెజెండ్స్ అనిపించుకున్నవారే కావడం గమనార్హం. పదుల కోట్లతో సినిమాను నిర్మించడమే గాక, కోట్లు పెట్టి ఆడియో ఫంక్షన్ జరిపి షాకిచ్చారు. అయితే నిర్మాత కూడా అతనే కావడంతో ప్రతి హీరోయిన్ కి చార్టర్డ్ ఫ్లైట్ టిక్కెట్ తో పాటు పారితోషికం కూడా ఇచ్చి తీసుకువచ్చాడని టాక్. ఇంతటి హంగామా, అంతమంది హీరోయిన్లు పాన్ ఇండియా హీరోల ఫంక్షన్స్ లో కూడా కనిపించరు.
తాజాగా లెజెండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూసినవారికి ఇతను హీరో ఏంటి? బాగా అతి చేస్తున్నాడు.. అనిపించవచ్చు. కానీ ఓసారి ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న హీరయిన్లను చూడండి. పూజాహెగ్డే, తమన్నా, ఊర్వశి రౌటేలా, హన్సిక, శ్రీలీల, లక్ష్మీ రాయ్, శ్రద్ధా శ్రీనాథ్, డింపుల్ హయతి, యాషికా ఆనంద్, నూపూర్ సనన్ లాంటి సూపర్ హాట్ హీరోయిన్స్ హాజరై మరో షాకిచ్చారు. బాబోయ్.. ఇంత గొప్పలకు పోతున్నాడంటే.. ఆ డెబ్యూ హీరో ఎవరనేది తెలుసుకోవాలని ఉందా..! అతని పేరు లెజెండ్ శరవణన్. అరే.. ఈ పేరెక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది. అంటే.. అవును. ‘ది లెజెండ్ శరవణ స్టోర్స్’ అనే బట్టల షోరూమ్ యాడ్ లో అతను కనిపిస్తుంటాడు.
చెన్నైలోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటైన శరవణ స్టోర్స్ అధినేతే ఈ లెజెండ్ శరవణన్. అదేంటి పేరు వెనుక లెజెండ్ అని ఉందేంటి.. ఎవరిచ్చారు? అంటే.. ఎవ్వరూ ఇవ్వలేదు తనకు తానే పెట్టేసుకున్నాడు. తన మాల్ ప్రమోషన్స్ కి ఏ స్టార్ హీరోలను పిలవకుండా.. హీరోయిన్లతో కలిసి తానే యాడ్స్ లో యాక్ట్ చేస్తుంటాడు. ఇదేం విడ్డూరం.. అనుకోవద్దు. లెజెండ్ శరవణన్ కి మొదటి నుండే యాక్టింగ్, సినిమాలంటే ఇష్టమట. ఆ విషయం కూడా ది లెజెండ్ ట్రైలర్, సాంగ్స్ చూస్తేగానీ తెలియలేదని అంటున్నారు తమిళ జనాలు. ఈ హీరో లుక్స్ పరంగా కమెడియన్లకు తక్కువ, హైట్ లో హీరోయిన్లకు కూడా తక్కువగానే కనిపిస్తాడు. అదే అతని స్పెషాలిటీగా భావిస్తూ దూసుకుపోతున్నాడు,
సరే.. హీరోయిన్లతో కలిసి తన షాపింగ్ మాల్ యాడ్స్ వరకూ ఏం చేసినా నడుస్తుందని అనుకోవచ్చు. కానీ అదే మోడల్ శరవణన్ గారు ఇప్పుడు ‘లెజెండ్’ అంటూ యాక్షన్ సినిమా హీరోగా రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అదికూడా భారీ కమర్షియల్ సినిమాల తరహాలో భారీ కథ, బిల్డప్పులతో కూడిన స్టంట్స్, భారీ బడ్జెట్, స్టార్ టెక్నీషియన్స్ ఇలాంటివన్నీ ప్రేక్షకులు నోరెళ్ళ బెట్టుకునేలా చేస్తున్నాయి. ఇక లెజెండ్ సినిమాలో శరవణన్ సైంటిస్టు పాత్రలో కనిపించనున్నాడు. తమిళ జనాల సంగతేమోగానీ.. లెజెండ్ ట్రైలర్ చూసిన తెలుగు జనాలు మాత్రం షాక్ కి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. 51 ఏళ్ళ శరవణ.. డాన్స్, ఫైట్స్, రొమాన్స్ అన్నింట్లో తేలిపోయాడని అంటున్నారు. ఇక లెజెండ్ లో లక్ష్మీరాయ్ హీరోయిన్ కాగా హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. జేడీ, జెర్రీ డైరెక్టర్స్. మరి శరవణ స్టోర్స్ వారి ‘ది లెజెండ్’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.