ఓ వయసు రాగానే ఆడ, మగ ఓ తోడు కోరుకోవటం సహజం. అయితే, పెళ్లి చేసుకుని వివాహం అనే బంధంలోకి అడుగు పెట్టేవారికంటే.. ప్రేమ పేరు చెప్పి అవసరాలు, కోర్కెలు తీర్చుకునే వారే ఈ మధ్య కాలంలో ఎక్కువయిపోయారు. అది కూడా యుక్త వయసువాళ్లు ఈ పనులు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్లు ఇలా పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆడవాళ్లు కావచ్చు.. పురుషులు కావచ్చు.. ఎవరికి వారు తమ మోటివ్‌ను దృష్టిలో పెట్టుకుని రిలేషన్‌లోకి అడుగుపెడతారు. ప్రముఖ సైకాలజిస్ట్, న్యూరోమెంటర్ పూజితా జోష్యుల ఆ కారణాల గురించి స్పష్టంగా వివరించారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఓ మనిషి పెళ్లి కాకుండానే రిలేషన్‌లోకి అడుగుపెట్టాడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో శారీరక కోర్కెలు ఒకటి. ఇదొక బేసిక్ బయోలాజికల్ నీడ్. ఆకలి, దప్పిక, నివాసం ఎలాగో శారీరక అవసరం కూడా అంతే. మనకు పెళ్లి చేసుకోవటానికి ఓ నిర్థిష్ట వయసు ఉంది. ప్యూబర్టీ తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోనల్ మార్పుల కారణంగా కోర్కెలు పెరుగుతాయి. 14 ఏళ్లనుంచే ఇవి మొదలవుతాయి. అయితే, ఆ కోర్కెలు తీర్చుకోవటానికి 21 ఏళ్ల వరకు ఆగాల్సి వస్తుంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయటానికి ఓ రిలేషన్ అవసరం అవుతుంది. తమ కోర్కెలను తీర్చుకోవటానికి బంధంలోకి అడుగుపెడతారు.
సైకలాజికల్ నీడ్ : ఆ ఏజ్‌లో.. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్స్‌కు చాలా కారణాలతో సైకలాజికల్ నీడ్స్ అవసరం అవుతాయి. ఇంట్లో వారు తమ బాధల్ని పట్టించుకోకపోవటం, ప్రేమగా చూసుకోకపోవటం వల్ల.. పక్కవాడికి లవర్ ఉంది.. నాకు లేదు అన్న భావన వల్ల కూడా రిలేషన్‌లోకి అడుగుపెడతారు.
ఆర్థిక అవసరాలు : ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, తాజా పరిణామాలు చూసుకుంటే.. వాళ్ల చుట్టు పక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇతరుల వద్ద పెద్ద పెద్ద ఐఫోన్స్ చూస్తూ ఉంటారు. వాళ్లేదో పెద్ద కార్లలో వస్తారు. మంచి బ్రాండ్ బట్టలు వేసుకుంటారు. బ్రాండ్ కళ్లజోడు పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్లు చూస్తూ ఉంటారు. లోపల ఎక్కడో ఇన్‌ఫీరియారిటీ కలుగుతుంది. నాక్కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈజీగా పడిపోతారు. బహుమతులు ఇవ్వటం అన్నది ఇక్కడ ప్రధానం. ఫారెన్ కంట్రీస్‌లో షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ అని ఉంటారు. వాళ్లు తమకంటే తక్కువ వయసున్న వారితో సంబంధాలు పెట్టుకుంటారు. అందుకు ప్రతి ఫలంగా డబ్బులు, ఆస్తులు, బహుమతులు ఇస్తుంటారు. ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే ఇండియాలోకి అడుగుపెడుతోంది.
సోషల్ నీడ్ : ఇది కొంత మనకు నవ్వు తెప్పిస్తుంది. కొంతమంది యువతీ, యువకులు పక్కవారిని చూసి బంధంలోకి అడుగుపెడుతుంటారు. ఇక్కడ నాకోక లవర్ ఉన్నాడు లేదా ఉంది అని చెప్పకోవటమే గొప్ప. ఇక్కడ భాగస్వామి ఉండటమే పెద్ద డ్రీమ్. కేవలం ఈ కారణంతోటే కొంతమంది రిలేషన్‌లోకి అడుగుపెడుతున్నారు. తమ పక్కన ఓ వ్కక్తి ఉండటాన్ని గొప్ప విషయంలా భావిస్తుంటారు.