ప్రస్తుత కాలంలో ఒకే జెండర్‌కి చెందిన వారి మధ్య ప్రేమ, వివాహం చేసుకోవడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని ఆలోచించి.. గే, లెస్బియన్ వివాహాలకు అంగీకారం తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలా పెళ్లి పీటలు ఎక్కిన వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా అరుదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
టీచర్‌గా న్యూయార్క్‌లో స్థిరపడిన సూఫీ మాలిక్ అనే యువతికి.. నాలుగేళ్ల క్రితం భారత దేశానికి చెందిన ఈవెంట్ ప్లానర్, ప్రొడ్యూసర్ అంజలితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడం, పెళ్లి పీటలు ఎక్కడం వరకు వచ్చింది. ఇక వీరి ప్రేమ కథను వింటే.. సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌లు, షాకులు మాములుగా ఉండవు. వీరిద్దరూ 2018లో తొలిసారి కలుసుకున్నారు. అంతకు పూర్వం.. ఏడేళ్లుగా ఒకరికొకరు తెలుసు. టంబ్లర్ అనే నెట్‌వర్కింగ్ సైట్లో వీరిద్దరూ బ్లాగులు రాసేవారు. దాంతో ఒకరిని ఒకరు ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత కొన్నాళ్లుకు వీరద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌కు మారారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. హాయ్, బాయ్‌ల నుంచి వ్యక్తిగత విషయాలు పంచుకునేంతగా వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఈ క్రమంలో 2018లో అంజలి తొలిసారి.. తన స్నేహితురాలిని కలవడం కోసం అంజలి తొలిసారి న్యూయార్క్ వెళ్లింది. అప్పుడే మొదటిసారి సూఫీని కలిసింది. ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారు. తొలి చూపులోనే ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం ఉన్నట్లు అనిపించింది. కలుసుకున్న గంటల వ్యవధిలోనే.. తిరిగి ఇంటికి వెళ్లాలంటే.. చాలా బాధగా అనిపించింది అని చెప్పుకొచ్చారు ఈ జంట.
అయితే అప్పటికే అంజలికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యింది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో సూఫీనే అండగా నిలిచింది. దాంతో వారి మధ్య మరింత అనుబంధం పెరిగింది. ఇక ఆ తర్వాత నుంచి వారిద్దరూ.. వెకేషన్లకు వెళ్లడం, పార్టీల్లో కలుసుకోవడం చేసేవారు. ఆ సమయంలోనే తామిద్దరూ ప్రేమలో ఉన్నామనే విషయం వారికి అర్థం అయ్యింది. ఈ క్రమంలో 2019లో ఫోటో షూట్ ద్వారా తమ ప్రేమ గురించి ప్రపంచానికి వెల్లడించారు. రొమాంటిక్ ఫోజులతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు.
ఆ తర్వాత ఈ జంట తమ ప్రేమ గురించి వారిళ్లల్లో చెప్పారు. అయితే సూఫీ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. కానీ ఆమె స్నేహితులు, కజిన్స్ అండగా నిలిచారు. ఇక అంజలి కుటుంబ సభ్యులు మాత్రం వెంటనే ఓకే చెప్పేశారు. అలా చివరకు నాలుగేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వీరద్దరూ తొలిసార కలుసుకున్న న్యూయార్క్ ఎంపైర్ బిల్డింగ్‌లోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా మరోసారి ప్రపోజ్ చేసుకుని.. ఉంగరాలు మార్చుకుని.. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట వైరలవుతున్నాయి. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.